Karnataka honor killing: కర్ణాటక మైసూరులోని పెరియపట్న పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. దళిత యువకుడ్ని ప్రేమించిందనే కారణంతో కన్న కూతురినే కడతేర్చాడు తండ్రి. ఆమెను గొంతునులుమి హత్య చేశాడు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అనంతరం మంగళవారం ఉదయం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు నిందితుడు. చనిపోయిన బాలిక పేరు శాలిని(17) కాగా.. తండ్రి పేరు సురేశ్.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం కగ్గుండి గ్రామానికి చెందిన సురేశ్ కూతురు శాలిని.. పీయూసీ రెండో సంవత్సరం చదువుతోంది. పొరుగూరు మెల్లహళ్లి గ్రామానికి చెందిన యువకుడ్ని ప్రేమిస్తోంది. వీరు ఇద్దరు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసి తమ అమ్మాయి మైనర్ అయినందున తల్లిదండ్రులు అతడిపై కేసు పెట్టారు. అయితే తాను ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నాని తల్లిదండ్రులకు వ్యతిరేకంగా శాలిని పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. తాను ఇంటికి వెళ్లనని చెప్పింది.
ఆ తర్వాత పోలీసులు ఆమెను పర్యవేక్షణ గృహానికి పంపారు. ఆ తర్వాత కొద్ది రోజులకు బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి తనను ఇంటికి తీసుకెళ్లమని అడిగింది. దీంతో తండ్రి సురేశ్ వచ్చి శాలినిని ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా బాలిక తాను ఆ అబ్బాయినే ప్రేమిస్తున్నానని, అతడ్నే పెళ్లి చేసుకుంటానని మరోసారి తేల్చి చెప్పింది. దీంతో ఆగ్రహించిన తండ్రి ఆమెను గొంతునులుమి హత్య చేశాడు. అమ్మాయిది కర్ణాటకలో అగ్రవర్ణంగా పరిగణించే వొక్కలిగ సామాజిక వార్గం. ఆమె ప్రేమించిన యువకుడిది దళిత సామాజిక వర్గం. దీంతో తన కూతురు తక్కువ కులస్థుడిని ప్రేమిస్తోందనే కారణంతో తండ్రి దారుణానికి పాల్పడ్డాడు.
ఇదీ చదవండి: వ్యవసాయ మార్కెట్లో కుప్పకూలిన దుకాణం.. ముగ్గురు దుర్మరణం