Gas tanker overturns: ఝార్ఖండ్, హజారిబాగ్‌లో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ముగ్గురు సజీవ దహనమయ్యారు.
చౌపరన్ నుంచి వస్తున్న ట్యాంకర్ రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఝార్ఖండ్-బిహార్ సరిహద్దుల్లోని దనువా లోయ సమీపంలో జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఆ తర్వాత ట్యాంకర్‌కు మంటలు అంటుకున్నాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించటం వల్ల ముగ్గురు సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడ్డ మరో యువకుడిని బిహార్‌లోని బారాచట్టి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఒకరు బబ్లూ యాదవ్(35)గా గుర్తించారు. మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉంది.
2 కిలోమీటర్ల మేర వ్యాప్తించిన మంటలు
గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటం వల్ల సుమారు 2 కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించాయి. చెట్లు, మొక్కలు, విద్యుత్తు స్తంభాలు, తీగలు పూర్తిగా కాలిపోయాయి. 14 టైర్ల డంపర్లు, ట్రక్కులు, కార్లు కలిపి మొత్తం 7 వాహనాలు దగ్ధమయ్యాయి.
10 కిలోమీటర్ల మేర అలర్ట్
సమచారం అందుకున్న చౌపరన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది, జిల్లా అధికారులు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గ్యాస్ ట్యాంకర్ పేలుడుతో రహదారిపై గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. దీంతో ఝార్ఖండ్-బిహార్ సరిహద్దుల్లను చోర్దాహా చెక్‌పోస్ట్ వద్దే రాష్ట్రంలోకి ప్రవేశించే, బయటకు వెళ్లే వాహనాలను నిలిపేశారు పోలీసులు. సుమారు 10 కిలోమీటర్ల పరిధిలో ప్రజలను అప్రమత్తం చేశారు.
ప్రమాదం జరిగిన సమయంలో మృతుడు బబ్లూ తన వాహనంలోకి వస్తువులను ఎక్కిస్తున్నాడని, ఆకస్మికంగా మంటలు వ్యాపించి కాలిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబ సభ్యులు. ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: నూడిల్స్ ఫ్యాక్టరీలో పేలుడు- ఐదుగురు మృతి!