Gas Leak Mangalore: కర్ణాటకలోని మంగళూరులో విషాదం జరిగింది. మంగళూరు స్పెషల్ ఎకనామిక్ జోన్‌లోని శ్రీఉల్కా ఎల్ఎల్పీ షిఫ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ప్రమాదానికి గురైంది. గ్యాస్ లీకవడం కారణంగా ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషమ పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరిన వీరికి ప్రస్తుతం ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం సుమారు 6-7 గంటల మధ్య జరిగిన ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. ప్లాంట్‌లోని ఫిష్ వేస్ట్ ట్యాంకును శుభ్రం చేయడానికి ఓ ఉద్యోగికి లోపలికి వెళ్లాడు. ట్యాంకులోకి దిగిన కొద్ది సేపటికే అతను అస్వస్థతకు గురయ్యాడు. అతడిని రక్షించేందుకు వెళ్లిన మిగతా కార్మికులకు కూడా అదే పరిస్థితి ఎదురైంది. మొదట దిగిన వ్యక్తి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మిగతా వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అర్ధరాత్రి చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరు సోమవారం ఉదయం మృతిచెందారు.
మృతులు మహమ్మద్ సమరుల్లా ఇస్లాం, ఉమరుల్లా ఫరూక్, నిజాముద్దిన్, షరాకత్ అలీ, నిజాముద్దిన్ ఇస్లాంలు పోలీసులు గుర్తించారు. హస్సన్ అలీ, మహమ్మద్ అలీబుల్లా, అఫీసుల్లా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. మొదటగా నిజాముద్దిన్ ట్యాంకులోకి దిగి ప్రాణాలు కోల్పోయాడని.. అతడిని కాపాడే క్రమంగా మిగతా నలుగురు చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. 20-23 ఏళ్ల వయసు ఉన్న వీరంగా బంగాల్‌కు చెందిన వారని తెలిపారు.
ఈ ఘటనపై ప్లాంట్ యజమాని సహా నలుగురి మీద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేపడుతున్నామని.. విషవాయువుకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని తెలిపారు. బాధితుల శరీరంలో చేప వ్యర్థాలు చిక్కుకున్నట్లు ఫస్ట్ ఎయిడ్ చేసిన వైద్యులు తెలిపినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. రంగంలోకి 20ఫైర్ ఇంజిన్లు