పుస్తకాల్లో రామకోటి, సాయికోటి పేరుతో దేవుడి నామాలు రాస్తు ఆపార భక్తిని చాటుకుంటారు కొందరు. ఇదే విధంగా ఓ శిల్పి తన భక్తిని భిన్నంగా చాటుకున్నాడు. తన ప్రతిభకు పదునుపెట్టి.. హనుమాన్ చాలీసాను పుస్తకంగా చెక్కాడు. చెక్కపై ప్రతి అక్షరానికి ఆయువు పోశాడు. ఆయనే ఒడిశా గంజాం జిల్లాకు చెందిన శిల్పి అరుణ్ సాహు.
నెల రోజుల్లోనే..
హింజులికట్ కంటేయ్కొలి గ్రామానికి చెందిన సాహు..నెల రోజుల్లోనే చెక్కతో హనుమాన్ చాలీసాకు పుస్తకరూపమిచ్చాడు. ఒరియా, హిందీ.. రెండు బాషల్లో ఈ పుస్తకాన్ని చెక్కడం విశేషం.
"చెక్క, ఉలి, బ్లేడు సాయంతో.. ఐదు పేజీలుగా హనుమాన్ చాలీసా తయారు చేశాను. రెండు కవర్ పేజీలు అమర్చి.. వాటిపై హనుమంతుడి బొమ్మను చెక్కాను. ఈ చెక్క పుస్తకం పొడవు 10.5 అంగుళాలు. వెడల్పు 9 అంగుళాలు. ప్రతి పేజీ 2.5 అంగుళాల మందం ఉంటుంది. లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఈ పుస్తకాన్ని తయారు చేశాను."
- అరుణ్ సాహు, శిల్ప కళాకారుడు.
అరుణ్ తయారు చేసిన ఈ పుస్తకంపై కుటుంబ సభ్యులు, ఆయన మిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ అరుణ్ అద్భుత కళాఖండాలకు రూపమిచ్చాడని చెబుతున్నారు. తాజ్‌మహల్, ఈఫిల్ టవర్, ఒడిశా అసెంబ్లీతో పాటు ఇతర కళాకృతులను చెక్కతో తయారు చేశాడని ప్రశంసించారు.
మోదీకి ఇవ్వాలని...
హిందీలో చేసిన హనుమాన్ చాలీసా ప్రధాని మోదీకి, ఒరియాలో చేసింది ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు బహుమతిగా ఇవ్వాలని ఆశాభావం వ్యక్తం చేశాడు అరుణ్. అన్ని బాషల్లో ఈ విధమైన హనుమాన్ చాలీసా తయారు చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపాడు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో దీనికి స్థానం ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పాడు.
ఇదీ చదవండి:Viral: పిడుగు పడటం లైవ్‌లో చూశారా?