Gang Rape On Dalit Sisters: ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. మార్కెట్‌కు వెళ్లి వస్తున్న ఇద్దరు దళిత అక్కచెల్లెళ్లపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని బికాపుర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు దళిత అక్కచెల్లెళ్లు సోమవారం సాయంత్రం షేర్పూర్ పారా బజార్‌కు వెళ్లారు. షాపింగ్ ముగించుకుని వస్తున్న సమయంలో ఓ నలుగురు యువకులను వారిద్దరిని చెరకు తోటలోకి బలవంతంగా తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని బెదిరించారు.
మార్కెట్‌కు వెళ్లి చాలా సేపు అయినా బాధితురాళ్లు ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబసభ్యులు పరిసర ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. చెరకు తోటలో ఏడ్చుకుంటూ కూర్చున్న బాధితులను గుర్తించి విషయం అడిగి తెలుసుకున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు.. చికిత్స నిమిత్తం బాధితురాళ్లను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
గోడపై సూసైడ్ నోట్ రాసి వివాహిత ఆత్మహత్య..
అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత బలవనర్మణానికి పాల్పడింది. ఆత్మహత్య చేసుకునే ముందు.. గోడపై ఎర్రటి సిరాతో సూసైడ్ నోట్ రాసింది బాధితురాలు. తన మరణానికి భర్తే కారణమని పేర్కొంది. ఈ ఘటన ఝార్ఖండ్‌లోని రాంచీ జిల్లాలో జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని ఖలారీ ప్రాంతానికి చెందిన దిలీప్ కుమార్ అనే వ్యక్తిని బాధితురాలు చందాదేవి 2019లో వివాహం చేసుకుంది. పెళ్లైనప్పటి నుంచి చందాదేవిని అత్తమామలు, భర్త.. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. ఆ తర్వాత చందాదేవికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. దీంతో వేధింపులు మరింత పెరిగిపోయాయి. కన్నవారింటి నుంచి రూ.15 లక్షలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అందుకు చందాదేవి నిరాకరించడం వల్ల ఆహారం పెట్టకుండా దారుణంగా కొట్టారు.
ఇక ఈ వేధింపులు తాళలేక బాధితురాలు బుధవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అనంతరం గోడను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. తాను ఎదుర్కొన్న ఇబ్బందులన్నింటినీ గోడపై ఎర్రటి సిరాతో రాసింది చందాదేవి. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె భర్త దిలీప్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.
చెల్లిపై గ్యాంగ్‌రేప్.. అక్క కిడ్నాప్
రాజస్థాన్‌లోని భరత్‌పుర్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ బాలిక తన అక్కతో కలిసి పొలానికి వెళ్లింది. అదే సమయంలో కారులో వచ్చిన కొందరు దుండగులు.. మైనర్‌ను బలవంతంగా కారులోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం బాలికను అక్కడే వదిలేశారు. వెంటనే బాధితురాలి అక్కను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. మైనర్‌ను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితులతో పాటు బాధితురాలి అక్క కోసం గాలిస్తున్నారు.
ఎస్‌డీఎంపై హాస్టల్ సూపరింటెండెంట్ ఆరోపణలు
మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా పిచోర్ ఎస్డీఎం బిజేంద్ర ప్రసాద్ యాదవ్‌పై ఓ సీనియర్ బాలికల హాస్టల్ సూపరింటెండెంట్ తీవ్ర ఆరోపణలు చేశారు. హాస్టల్‌లో ఉంటున్న బాలికల సంఖ్యపై తరచూ ఆయన ఆరా తీసేవారని హాస్టల్ సూపరింటెండెంట్ ఆరోపించారు.
"మెట్రిక్ సహా వివిధ తరగతులకు చెందిన 50 మంది విద్యార్థినిలు హాస్టల్‌లో ఉండేవారు. ఆ వివరాలు ఆయనకు చెప్పినప్పుడు.. కొందరు అమ్మాయిలను తన ఇంటికి పంపమని చాలా సార్లు చెప్పారు. అందుకు నేను నిరాకరించేదాన్ని. అయితే నన్ను వేరే ప్రదేశానికి బదిలీ చేస్తానని బెదిరించేవారు. బాలికలను పంపిస్తే డివిజనల్ కన్వీనర్‌గా ప్రమోషన్ ఇప్పిస్తానని కూడా చెప్పేవారు." అని బాధిత హాస్టల్ సూపరింటెండెంట్ తెలిపారు.
అయితే తనపై వచ్చిన ఆరోపణలను ఎస్డీఎం బిజేంద్ర యాదవ్ కొట్టిపారేశారు. విధుల్లో భాగంగానే హాస్టల్స్‌కు తనిఖీకి వెళ్లేవాడనని, హాస్టల్ సూపరింటెండెంట్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవి అన్నారు.
ఇవీ చదవండి: బురద నీటిలో యోగా, స్నానం.. రోడ్ల దుస్థితిపై వెరైటీ నిరసన.. ఎమ్మెల్యే షాక్!
కంట్లో ఆరు అంగుళాల కత్తి.. వైద్యుల క్లిష్టమైన సర్జరీ.. బాధితుడు సేఫ్!