Rajasthan Theft News: రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఓ వ్యాపారవేత్త ఇంట్లో దోపిడి జరిగింది. ఇంట్లో పనిచేసేవారే.. యజమాని కుటుంబాన్నంతా బంధించి దొంగతనానికి పాల్పడ్డారు. ఇంట్లోని నగదు, నగలు, ఖరీదైన వస్తువులన్నీ యజమాని కారులోనే పారిపోయారు దుండగులు. అనంతరం ఆ కారును బైపాస్ రోడ్డు వద్ద వదిలిపెట్టి.. విలువైన వస్తువులను మరో వాహనంలోకి మార్చుకుని ఉడాయించారు. సోమవారం రాత్రి 8 నుంచి 11 గంటల మధ్య ఈ దొంగతనం జరిగిందని.. నిందితుల్లో ముగ్గురు మహిళలు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
జైపుర్ కర్ణి విహార్ పోలీస్ స్టేషన్ పరిధి ద్రోణపురీ కాలనీలో వ్యాపారవేత్త మైథిలీ శరణ్ నివసిస్తున్నాడు. అతడి ఇంట్లోని నగదు, విలువైన వస్తువులను చూసిన పనిమనిషులు ఎలాగైనా దొంగిలించాలని కుట్ర పన్నారు. నేపాల్‌కు చెందిన ఈ ముఠా.. ఇంటి యజమాని, అతని కుటుంబ సభ్యులపై సుత్తి, లాఠీలతో దాడి చేసింది.. ఈ క్రమంలో ఏడాది వయసు ఉన్న చిన్నారిని కూడా వదలకుండా అందరినీ బంధించింది. అనంతరం ఇంట్లోని ఆభరణాలు, నగదు విలువైన వస్తువులను తీసుకుని యజమాని కారులోనే పరారైంది. కొంతదూరం వెళ్లాక వేరే వాహనంలో నిందితులు పరారయ్యారు. నిందితులను పట్టుకునేందుకు సీసీటీవీ ఫూటేజీలను పరిశీలిస్తున్నారు పోలీసులు. దొంగిలించిన వస్తువుల జాబితాను యజమాని వెల్లడించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: 80 అడుగుల మరో వంతెన మాయం.. ఈసారి పక్క జిల్లాలో!