ప్రముఖ గాంధేయవాది డాక్టర్ ఎస్‌ఎన్ సుబ్బారావు ఇకలేరు. గుండెపోటుతో మంగళవారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ఆసుపత్రిలో చేరిన ఆయన.. ఈ రోజు ఉదయం 7 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు.
ఎస్‌ఎన్ సుబ్బారావు పూర్తి పేరు సలేమ్ నంజుండయ్య సుబ్బారావు. బెంగళూరులో 1929 ఫిబ్రవరి ఏడో తేదీన ఆయన జన్మించారు. పాఠశాలలో విద్యను అభ్యసించే సమయంలో గాంధీ బోధనల పట్ల ఆకర్షితులైన ఆయన... 13 ఏళ్ల వయసులో వీధుల్లో క్విట్ ఇండియా నినాదాలు రాస్తూ పోలీసులకు చిక్కి జైలుకు సైతం వెళ్లివచ్చారు.
అనంతరం స్వాతంత్ర్య సంగ్రామంలో చురుగ్గా పాల్గొన్నారు. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఛంబల్ ప్రాంతంలో మహాత్మాగాంధీ సేవా ఆశ్రమం స్థాపించి స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించారు. ఎస్‌ఎన్ సుబ్బారావు సేవలకు గుర్తుగా కేంద్రం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
సుబ్బారావు అరోగ్య పరిస్థితి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్... సవాయ్ మాన్‌సింగ్ ఆసుపత్రికి మంగళవారం చేరుకుని అతని ఆరోగ్యం గురించి వాకబు చేశారు. ఈ రోజు ఆయన మరణ వార్త తెలుసుకున్న గెహ్లోత్ సంతాపం తెలిపారు. సుబ్బారావు మరణం.. తనని తీవ్రంగా కలచివేసిందని అన్నారు. అతని లోటు ఎవరూ పూడ్చలేనిదని ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి: పెగసస్పై దర్యాప్తునకు నిపుణుల కమిటీ ఏర్పాటు- సుప్రీం ఉత్తర్వులు