చంపారన్... గాంధీని జాతీయోద్యమ నేతగా నిలబెట్టిన చోటు. భారత్‌లో తొలిసారిగా సత్యాగ్రహాన్ని ఆరంభించింది ఇక్కడి నుంచే. ఈ సందర్భంగానే ఆయనకు జీవితంలో మరవలేని అనుభవం ఎదురైంది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన తొలిరోజుల నాటి సంఘటన ఇది.
చంపారన్‌లో రైతుల కష్టాలపై పోరాడాల్సిందిగా స్థానిక రైతు రాజ్‌కుమార్ శుక్లా గాంధీజీని కోరారు. స్వయంగా చూస్తేగాని తాను ఏమీ చేయలేనంటూ ఆయన బదులిచ్చారు. సమయం చూసుకొని ఓరోజు వస్తానన్నారు. మాటమాత్రంగా చెప్పారే తప్ప ఆయనకు చంపారన్ అంతగా దృష్టిలో లేదు. శుక్లా మాత్రం గాంధీజీని వదల్లేదు. నెలల తరబడి ఆయనెక్కడికి వెళితే అక్కడికి వెళుతూ... చంపారన్... చంపారన్ అంటూ గుర్తు చేసేవారు. మొదట్లో కాసింత విసుగ్గా అన్పించినా, శుక్లా పట్టుదల చూశాక గాంధీజీకీ వెళ్లి చూడాలనిపించింది. తన ఆత్మకథలో కూడా గాంధీజీ 'అమాయకుడేగాని అతనిలోని పట్టుదల నన్ను చంపారన్‌కు తీసుకెళ్లింది' అని శుక్లా గురించి రాశారు.
ఓ రోజు కోల్‌కతా నుంచి ఇద్దరూ హౌరా-దిల్లీ రైలులో బయల్దేరారు. వెళుతుంటే కూడా గాంధీజీకి ఎందుకనో శుక్లాను నమ్మబుద్ధికాలేదు. అనవసరంగా సమయం వృథా చేస్తున్నానేమో అనిపించింది. కానీ మాటిచ్చారు కాబట్టి వెనక్కి వెళ్లలేని పరిస్థితి. అలా... 1917 ఏప్రిల్ 10న పట్నాలో దిగారిద్దరూ. అప్పటికి గాంధీజీ అంతగా ఎవ్వరికీ తెలియదు. పట్నాలో కాంగ్రెస్ నేతగా ఎదిగిన డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ ఇంటికి తీసుకెళ్లారు శుక్లా. కానీ ఆయన ఊర్లో లేరు. దీంతో గాంధీజీని ఆ రోజుకు ఇంట్లో ఉండనివ్వాల్సిందిగా ప్రసాద్ పనివారికి శుక్లా విజ్ఞప్తి చేశారు. కానీ వారు ససేమిరా అన్నారు. పైగా మట్టిగొట్టుకుపోయిన గాంధీజీ దుస్తుల్ని చూసిన వారు ఇంట్లోని బావిలోంచి నీరు తోడుకోవటానికి, మరుగుదొడ్డిని వాడటానికి కూడా గాంధీజీని అనుమతించలేదు. అంటరానివాడిగా దూరంగా ఉంచారు. దీనిపై గాంధీజీ తన స్నేహితుడికి రాసిన లేఖలో... 'నన్నిక్కడికి తీసుకొచ్చిన వ్యక్తికి ఏమీ తెలియదు. ఎవరో తెలియనివారింట్లో దించాడు. ఆ ఇంటి యజమానేమో ఊర్లో లేడు. ఆయన సేవకులు మమ్మల్ని బిచ్చగాళ్లలా చూశారు. తినమని అడగటం అటుంచి... కనీసం మరుగుదొడ్డి వాడుకోవటానికి కూడా అనుమతించలేదు' అని వివరించారు. తర్వాత... తాను లండన్‌లో ఉన్నప్పుడు తెలిసిన స్నేహితుడి ఇంటికి వెళ్లారు గాంధీజీ. అక్కడి నుంచి చంపారన్ రైతుల వద్దకు వెళ్లటం... వారి గాధలు, వ్యథలు విని గాంధీజీ చలించటం... సత్యాగ్రహం ఆరంభించటం... తర్వాతి పరిణామాలు!
ఇదీ చూడండి: చైనా సరిహద్దులో రాత్రింబవళ్లు నిఘా..