బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాలికి అయిన గాయం చాలా చిన్నదేనని.. ఈ విషయం ప్రజలందరికీ అర్థమైందని పేర్కొన్నారు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ. గాయాన్ని అడ్డంగా పెట్టుకుని మమత చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని.. ఇలాంటివి చూసి ప్రజలు టీఎంసీకి ఓట్లు వేయరని.. ఈటీవీ భారత్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.
"మమతా బెనర్జీకి ప్రమాదవశాత్తు గాయమైంది. అందరూ అదే అంటున్నారు. దీనిని రాజకీయం చేయకూడదు. ఎన్నికల్లో.. మమతతో పాటు మేము(భాజపా) కూడా ప్రజల ముందుకు వెళుతున్నాము. వారి నిర్ణయానికి కట్టుబడే ముందుకు సాగాలి. వివాదాలతో ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీయకూడదు. ఆమె గాయపడటం దురదృష్టకరం. కానీ దానిపై ఇలా రాజకీయాలు చేయకూడదు."
--- నితిన్ గడ్కరీ, కేంద్రమంత్రి.
'అబ్ కీ బార్ 200 పార్(ఈసారి 200కుపైగా సీట్లు సాధిస్తాం)' అన్న లక్ష్యాన్ని భాజపా చేరుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు గడ్కరీ. పార్టీ కార్యకర్తల శ్రమ ఫలిస్తుందన్నారు. ప్రజల మద్దతుతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. రెండేళ్లలో ప్రధాన రోడ్డు ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు గడ్కరీ.
294 సీట్లున్న బంగాల్ అసెంబ్లీకి ఈ నెల 27 నుంచి 8 విడతల్లో పోలింగ్ జరగనుంది. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.
ఇదీ చూడండి:- కుట్రలతో నన్ను అడ్డుకోలేరు: మమత