మహరాష్ట్రలోని గోండ్వానా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఆన్‌లైన్ పరీక్షలతో విద్యార్థులకు సరికొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. గడ్చిరోలి జిల్లాలో అంతర్జాల సేవలు సరిగా లేకపోవడం వల్ల.. పరీక్షల సమయంలో ఆ విద్యార్థులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
ఎన్నో సమస్యలు..
పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించాలని నిర్ణయించింది గోండ్వానా విశ్వవిద్యాలయం. బీఏ, బీఎస్సీ పరీక్షలు మార్చి 8-27 వరకు కొనసాగనున్నాయి. ఈ ప్రాంతంలో అంతర్జాల సేవలు సరిగా లేకపోవడం వల్ల చాలామంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాలేకపోతున్నారు. అలాగే అలాగే బేడాగావ్, కోర్చి వంటి చోట్ల విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడటం వల్ల మరింత ఇబ్బంది పడుతున్నారు. దీంతో విద్యార్థులకు ఆన్‌లైన్ పరీక్ష గురించి సమాచారం కూడా అందని పరిస్థితి నెలకొంది.
సరిహద్దులు దాటి..
పరీక్షలు రాసే విద్యార్థులు సిగ్నల్ నానా ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ఎత్తైన భవనాలు ఎక్కుతుండగా.. మరికొందరు సమీపంలోని అడవిలోకి వెళ్లి పరీక్షలు రాస్తున్నారు. గడ్చిరోలిలోని మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఏకంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం సరిహద్దు రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో సిగ్నల్ మెరుగ్గా ఉండే ప్రాంతాలైన.. దేవ్రీ, వాడ్సా, చిచ్‌గఢ్ వంటి ప్రదేశాలకు వెళ్లి పరీక్ష రాశారు.
అంతర్జాల సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని పదేపదే ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడు లేడని విద్యార్థులు విలపిస్తున్నారు. పరీక్షల సమయాన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: రాహుల్ గాంధీ 'కానుక'తో ఆ బాలుడు ఖుష్