ఎంతో శ్రమించి ఆ రైతు ఉల్లి పంటను పండించాడు. చేతికొచ్చిన రాబడిని ఆనందంగా మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయించాలకున్నాడు. అలా 415 కిలోమీటర్లు ప్రయాణించిన అతడికి చివరకు నిరాశే ఎదురైంది. ఎందుకుంటే రూ.25వేలకు పైగా ఖర్చు పెట్టి పండించిన ఆ పంటను అమ్మితే అతడికి 8 రూపాయలు మాత్రమే వచ్చాయి. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన రైతు తనకు న్యాయం జరగాలంటూ ఆ బిల్లును సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. దీనికి స్పందించిన మరికొంత మంది రైతులు అతడికి మద్దతు తెలిపారు. కర్ణాటకలోని యశ్వంతపుర్ మార్కెట్‌లో జరిగిన ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశమైంది.
గడగ్ తిమ్మాపుర్కు చెందిన పావాడెప్ప హళ్లికేరి అనే రైతు సుమారు 25000 రూపాయలు ఖర్చు చేసి ఉల్లి పంటను పండించాడు. 205 కిలోల మేర వచ్చిన దిగుబడిని సుమారు 415 కిలోమీటర్లు ప్రయాణం చేసి బెంగళూరులోని యశ్వంత్‌పుర్ మార్కెట్‌లో విక్రయించేందుకు వచ్చాడు. అయితే పంటను కొనుగోలు చేసిన హోల్‌సేల్ వ్యాపారి ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.200గా నిర్ణయించాడు. ఆ తర్వాత అందులో నుంచి కూలీ రూ.24, సరకు రవాణాకు రూ.377.64ను మినహాయించగా రూ.8.36 మిగిలిందని బిల్లులో పేర్కొన్నాడు. అలా అతనికి రూ.8.36 మాత్రమే లభించింది. ఆ బిల్లు చూసిన రైతుకు నోట మాట రాలేదు.
కొద్ది రోజుల క్రితమే క్వింటాల్ ధర రూ.500 పలికిందని ఎంతో ఆశగా తమ పంటను తీసుకొచ్చిన రైతులకు ఆ విలువ 200కు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ ఘటన వారిని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు తమ పంటలను నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు.