నక్సలైట్, కాటికాపరి, రిక్షావాలా, వంటమనిషి, ఛాయ్‌వాలా, లైబ్రేరియన్, నవలా రచయిత.. ఈ పాత్రలన్నీ పోషించింది ఒకే వ్యక్తి. నిజజీవితాన్ని ఇంత వైవిధ్యంగా సాగించిన ఆ వ్యక్తి.. ఇప్పుడు చట్టసభ్యునిగా ఎన్నికై, ప్రజా సేవ చేయాలని భావిస్తున్నారు. అందుకే టీఎంసీ తరఫున బంగాల్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మరి ఆయన కల నెరవేరుతుందా? ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారా?
ఆయనెవరు?
మనోరంజన్ వ్యాపారి(70)ది బంగాల్. దళిత కుటుంబంలో పుట్టి, చిన్ననాటి నుంచి ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటూ పెరిగిన ఆయన.. సమాజంలో పెరుగుతున్న అసమానతలతో అసంతృప్తి చెంది నక్సలైట్‌గా మారారు. కొన్నాళ్ల తర్వాత జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. కాటికాపరిగా తన జీవనాన్ని మొదలు పెట్టారు వ్యాపారి. కొంతకాలం రిక్షా తొక్కారు. రోడ్డుపక్కన టీ విక్రయించారు. ఆ తర్వాత 23 ఏళ్ల పాటు ఓ పాఠశాలలో వంట మనిషిగా పని చేశారు. అదే పాఠశాలలో లైబ్రేరియన్‌గానూ విధులు నిర్వహించారు. క్రమంగా బంగాల్ సాహిత్యంలో ప్రముఖ నవలా రచయితగా అవతరించారు.
ఆమె పరిచయం.. ఓ మలుపు
పొట్టకూటి కోసం రిక్షా తొక్కే మనోరంజన్.. సాహితీ ప్రపంచానికి పరిచయం కావడం వెనుక ఓ రచయిత్రి పాత్ర ఉంది.
ఓసారి వ్యాపారి రిక్షా ఎక్కారు రచయిత్రి మహాశ్వేతా దేవి. ఆమె ప్రయాణించింది కొద్ది సమయమే అయినా.. సాహిత్యంపట్ల మనోరంజన్‌కు ఉన్న ఆసక్తిని పసిగట్టారు. 'రిక్షా చలాయ్(నేను రిక్షా నడిపేవాడిని)' అనే నాన్-ఫిక్షన్ వ్యాసం రాసేలా ఆయన్ను ప్రోత్సహించి... ఆమె నడిపే బర్తికా మ్యాగజైన్లో ప్రచురించారు. తర్వాత ఎన్నో రచనలు చేసిన మనోరంజన్.. బంగాల్లో ప్రసిద్ధ నవలా రచయితగా పేరుగాంచారు.
రాజకీయ ప్రస్థానం
తన జీవితంలో ఎన్నో పాత్రలు పోషించిన వ్యాపారికి ఎలాంటి రాజకీయ అనుభవం లేదనే చెప్పొచ్చు! తాను ఎప్పుడూ రాజకీయవేత్తను కావాలని కలలో కూడా అనుకోలేదట. అయితే సమాజంలో పెరుగుతున్న అసమానతలు తనను రాజకీయంలోకి వచ్చేలా ప్రేరేపించాయని వ్యాపారి చెబుతున్నారు. అందుకే టీఎంసీ తరఫున హూగ్లీలోని బాలాగఢ్ నియోజవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు.
ఇదీ చూడండి: నాస్తికత్వానికి టాటా- డీఎంకే.. హిందూ ఓట్ల వేట!