కేరళ జైళ్ల శాఖ అధికారులు మరో వినూత్న కార్యక్రమానికి తెరతీశారు. 'ఫ్రీడమ్ లుక్స్' పేరుతో పురుషులు, పిల్లల కోసం బ్యూటీ పార్లర్‌ను ఏర్పాటు చేశారు. అయితే.. ఖైదీలే ఈ బ్యూటీపార్లర్‌ను నిర్వహిస్తుండడం ఆసక్తికరమైన అంశం. త్రిస్సూర్ జిల్లా వియ్యూర్ జైలు పార్కు సమీపంలో ఏర్పాటు చేసిన ఈ పార్లర్‌కు విశేషాదరణ లభిస్తోంది. సరసమైన ధరలో, నాణ్యమైన సేవలను అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు ఇక్కడి ఖైదీలు.
ఆ భయం అక్కర్లేదు!
ఖైదీలు అనగానే ఎవరికైనా కాస్త బెరుకు ఉంటుంది. కానీ, ఇక్కడ అలాంటి భయాలేమీ అవసరం లేదు. ఎందుకంటే.. సత్ప్రవర్తన గల, బ్యూటిషియన్ కోర్సు చేసిన ఖైదీలు ఈ పార్లర్లో సేవలను అందిస్తారు. అందుకే అందరూ నిశ్చింతగా వీరి వద్దకు విచ్చేస్తున్నారు. ఉదయం 7:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ పార్లర్ సేవలను అందిస్తున్నారు. తిరువనంతపురంలోని పూజప్పుర కారామానా రోడ్డులో ఇలాంటి మరో బ్యూటీ పార్లర్‌ను అక్కడి ఖైదీలు నిర్వహిస్తున్నారు.
అటు ప్రజలకు.. ఇటు ఖైదీలకు.
ఇప్పటికే 'ఫ్రీడమ్' బ్రాండ్‌తో కేరళ జైళ్ల శాఖ అధికారులు ఎన్నో విశేష కార్యక్రమాలు చేపట్టారు. ఫ్రీడమ్ ఆహార పదార్థాలు, ఫ్రీడమ్ పెట్రోల్ పంప్, ఫ్రీడమ్ శానిటైజర్లు, మాస్కులు, ఫ్రీడమ్ చెప్పులను తయారు చేసి, చక్కని ఆదరణ పొందారు. తాజాగా ఈ బ్యూటీ పార్లర్ ఏర్పాటుతో మరెంతో మందికి చేరువవుతున్నారు. ప్రజలకు మంచి ధరలో వివిధ సేవలను, ఉత్పత్తులను అందిస్తున్న 'ఫ్రీడమ్ బ్రాండ్'కు కేరళలో మంచి గుర్తింపు లభిస్తోంది. దానికి తోడు ఖైదీల ఆలోచన ధోరణిలో మార్పు తెచ్చేందుకు దోహదం చేస్తోందని చెబుతున్నారు జైళ్ల శాఖ అధికారులు.
ఇదీ చూడండి:వెయ్యి రూపాయల 'టీ' ఎప్పుడైనా తాగారా?