Four dwarfs of the same family: కాళ్లు, చేతులు బాగుండి.. విద్యావంతులైనా... యోగ్యతకు తగిన ఉద్యోగాలు లభించని రోజులివి! అలాంటిది ఒక మరుగుజ్జు ఇతరులతో సమానంగా బతకడం సవాలే. అందుకు శరీరం సహకరించకపోవడం ప్రధాన కారణమైతే.. తోటి సమాజ తోడ్పాటు కరవవ్వడం మరో కారణం. కర్ణాటక దొడ్డబళ్లాపురలోని ఓ కుటుంబం పడుతున్న అవస్థలే మరగుజ్జుల దుస్థితికి నిదర్శనం.
కనకేనహళ్లి కాలనీలో 9మందిగల ఓ కుటుంబం పేదరికంలో కొట్టుమిట్టాడుతోంది. షెడ్యూల్ కులానికి చెందిన ముట్టరాయప్ప, హనుమక్క దంపతులకు ఏడుగురు పిల్లలున్నారు. వారిలో నలుగురు మరుగుజ్జులే. వారు రెండు నుంచి మూడు అడుగుల ఎత్తువరకు ఉన్నారు. పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా... వారిని పనిలో పెట్టుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ముసలితనం కారణంగా తల్లిదండ్రులు ఎలాంటి పనిచేయలేకపోతున్నారు. దీంతో కుటుంబ బాధ్యత మొత్తం పెద్ద అక్క బైలమ్మ మీద పడింది. అయితే రోడ్డు ప్రమాదంలో ఆమె చేతులు విరిగి.. కుటుంబం పరిస్థితి మరీ దయనీయంగా మారింది.
36 ఏళ్ల పూజమ్మ, 23 ఏళ్ల ముత్తమ్మ, 26 ఏళ్ల నరసమ్మ, 18 ఏళ్ల అంజనామూర్తి.. మరుగుజ్జులు. పూజమ్మ పీయూసీ వరకు చదవింది. ఓ బట్టల దుకాణంలో పనిచేసేందుకు వెళ్లగా.. అందుకు ఆమె పనికిరాదని వారు పంపించేశారు. ప్రస్తుతం రోజూ కూలీగా పనిచేస్తూ.. కుటుంబాన్ని పోషించేందుకు కష్టపడుతోంది.
ముత్తమ్మ ఏడో తరగతి వరకు చదివింది. పై చదువుల కోసం పక్క ఊరికి వెళ్లాల్సిందే. అందుకోసం బస్సులో వెళ్లాల్సిందే. అయితే బస్సు ఎక్కలేకపోవడం.. స్నేహితుల హేళన కారణంగా ఆమె.. చదువుకు స్వస్తి చెప్పింది.
నిజానికి, మరుగుజ్జులు వికాంగుల విభాగం కిందకు వస్తారు. అయినప్పటికీ వారికి ఎలాంటి ప్రభుత్వ పథకాలు, వసతులు అందటం లేదు. వారికి ఏదైనా ఒక పనిలో నైపుణ్యం కల్పిస్తే.. సొంత కాళ్లపై నిలబడేందుకు దోహదంగా ఉంటుంది. అందుకోసం వికలాంగుల సాధికార శాఖ తమను పరిగణలోకి తీసుకొని, తగిన సహాయం చేయాలని ఈ మరుగుజ్జులు కోరుతున్నారు.
ఇదీ చూడండి: 'పిల్ల దొరికినా పెళ్లి చేయట్లేదు'.. తల్లిదండ్రులపై యువకుడి ఫిర్యాదు