దేశ రాజకీయాల్లో ఓ శకం ముగిసింది. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్ అనారోగ్యంతో కన్నుమూశారు. దేశ రాజకీయాల్లో ప్రతి మలుపును దగ్గరగా పరిశీలించిన కురువృద్ధుడి మరణంతో ఉత్తర్‌ప్రదేశ్ సహా దేశమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. సాధారణ కార్యకర్త నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ములాయం.. సుదీర్ఘకాలం పాటు యూపీకి ముఖ్యమంత్రిగా సేవలందించారు. 1975లో ఇందిరాగాంధీ అత్యవసర స్థితి విధించినప్పుడు ములాయం 19 నెలల పాటు జైలు శిక్ష అనుభవించి.. తన పోరాట పటిమతో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. పదిసార్లు ఎమ్మెల్యేగా.. ఏడుసార్లు ఎంపీగా గెలిచి.. రాజకీయ రణరంగంలో తనకు తిరుగులేదని ములాయం నిరూపించుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా మూడుసార్లు పనిచేసిన ఈ రాజకీయ కురువృద్ధుడు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరిగెత్తించారు.
ఉత్తర్‌ప్రదేశ్ రాజకీయాలను దశాబ్దాల పాటు శాసించిన ములాయం సింగ్ యాదవ్.. ఎటావా జిల్లాలోని సైఫాయి గ్రామంలో 1939 నవంబర్ 22న మూర్తిదేవి-సుఘర్‌సింగ్ యాదవ్ దంపతులకు జన్మించారు. ఉన్నత విద్యను అభ్యసించిన ములాయం.. రాజనీతి శాస్త్రంలో ఎంఏ చేశారు. అనంతరం రాజకీయాల వైపు అడుగులేసిన ములాయం.. రామ్ మనోహర్ లోహియా, రాజ్ నారాయణ్ వంటి మహా నేతల మార్గ దర్శకత్వంలో తనను తాను తీర్చిదిద్దుకున్నారు. 1967లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. అక్కడి నుంచి రాజకీయాల్లో వెనుతిరిగి చూడలేదు. 1975లో ఇందిరాగాంధీ అత్వవసర స్థితి విధించిన సమయంలో 19 నెలల పాటు ములాయం జైలు శిక్ష అనుభవించారు. 1977లో తొలిసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. 1980లో ఉత్తరప్రదేశ్‌లోని లోక్‌దళ్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తర్వాత లోక్‌దళ్ పార్టీ జనతా దళ్‌లో భాగమైంది. 1982లో ఉత్తరప్రదేశ్ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన ములాయం లోక్‌దళ్ పార్టీ చీలిపోయినప్పుడు క్రాంతికారి పేరుతో పార్టీని ప్రారంభించారు.
1992లో సమాజ్‌వాదీ పార్టీని స్థాపించిన ములాయం.. ఉత్తరప్రదేశ్‌లో దానిని తిరుగులేని శక్తిగా మార్చారు. పదునైన వ్యూహాలు.. ప్రజలను ఆకట్టుకునే ప్రసంగాలు.. తిరుగులేని నాయకత్వ పటిమతో సమాజ్ వాదీ పార్టీని అనతి కాలంలోనే అధికారం దిశగా నడిపించారు. పార్టీ స్థాపించిన సంవత్సరంలోనే 1993లో జరిగిన ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీతో కలిసి ఎన్నికల బరిలో దిగిన ములాయం పార్టీ సత్ఫలితాలను సాధించింది. 1989లో తొలిసారి సీఎం పీఠాన్ని అధిరోహించిన ములాయం.. 1993లో రెండోసారి.. 2003లో మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2003లో మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినప్పుడు ములాయం ఎంపీగా ఉన్నారు. ప్రమాణస్వీకారం చేసిన ఆరు నెలల్లోపు ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. 2004 జనవరిలో గున్నౌర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ములాయం.. ఆ ఎన్నికల్లో దాదాపు 94 శాతం ఓట్లతో రికార్డు స్థాయిలో విజయం సాధించి దేశం ఆశ్చర్యపోయేలా చేశారు.
ముఖ్యమంత్రిగా ఉత్తర్‌ప్రదేశ్‌ను ములాయం అభివృద్ధి పథంలో నడిపించారు. యూపీలో అనేక సంస్కరణలను పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారు. తన పారదర్శక పాలనతో అన్ని వర్గాలను తన వెంట నడిపించుకోగల సమర్థుడైన నేతని ములాయం అని ప్రత్యర్థులే కొనియాడేలా చేసుకున్నారు. 1996లో మెయిన్‌పురి నియోజకవర్గం నుండి పదకొండవ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ సంవత్సరం ఏర్పడిన యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వంలో ఆయన పార్టీ చేరింది. ఆయన భారత రక్షణ మంత్రిగా ఎంపికయ్యారు. భారతదేశం తాజా ఎన్నికలకు వెళ్లడం వల్ల ఆ ప్రభుత్వం 1998లో పడిపోయింది. అయితే అతను సంభాల్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి ఆ సంవత్సరం లోక్‌సభకు తిరిగి గెలుపొందారు. 1999 ఏప్రిల్‌లో కేంద్రంలో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం పడిపోయిన తర్వాత.. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వలేదు. 1999 లోక్‌సభ ఎన్నికలలో సంభాల్, కన్నౌజ్ అనే రెండు స్థానాల నుండి పోటీ చేసి.. రెండింటి నుండి గెలిచారు. ఉప ఎన్నికల్లో తన కుమారుడు అఖిలేష్ కోసం కన్నౌజ్ స్థానానికి రాజీనామా చేశారు.