కేంద్ర మాజీ మంత్రి ఆస్కార్ ఫెర్నాండెజ్ కన్నుమూశారు. కొంతకాలంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన... సోమవారం తుది శ్వాస విడిచారు.
జులై 18న ఉదయం యోగా చేస్తుండగా.. ఆసనంలో బ్యాలెన్స్ కోల్పోయి కింద పడ్డారు ఫెర్నాండెజ్. ఆ సమయంలో భౌతికంగా ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో ఆయన నిర్లక్ష్యం చేశారు. కానీ రోజువారీ చెకప్‌లో భాగంగా ఆసుపత్రికి వెళ్లగా.. మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే ఐసీయూకు తరలించి చికిత్స అందించారు.
వ్యక్తిగత జీవితం...
80ఏళ్ల ఆస్కార్ ఫెర్నాండెజ్.. 1941 మార్చి 27న ఉడిపిలో జన్మించారు. 12మంది సంతానంలో ఆయన ఒకరు. చిన్నప్పటి నుంచి క్యాథలిక్ ఆచారాల మధ్య పెరిగారు. ఆయనకు బ్లాసమ్ ఫెర్నాండెజ్‌తో వివాహమైంది. ఆయనకు ఇద్దరు సంతానం.
కీలక నేత.. కీలక బాధ్యతలు..
కాంగ్రెస్‌లో చేరిన ఫెర్నాండెజ్ అనతికాలంలోనే కీలక నేతగా ఎదిగారు. ముఖ్యమైన బాధ్యతలు ఎన్నో చేపట్టారు. 1984, 1989, 1991, 1996లో ఉడిపి నుంచే పోటీ చేసి లోక్‌సభలో అడుగుపెట్టారు. 1998, 2004లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. యూపీఏ హయాంలో రోడ్డు-రవాణా, కార్మికశాఖ మంత్రిగా పాటు అనేక పదవులు చేపట్టారు.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగానూ ఫెర్నాండెజ్ సేవలు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఫెర్నాండెజ్ గుర్తింపుపొందారు. పార్టీ తీసుకునే నిర్ణయాల్లో ఆయన కీలకంగా వ్యవహరించేవారు.