Pramod Gupta join BJP: సమాజ్‌వాదీ పార్టీకి మరో షాక్ తగిలింది. ములాయం సింగ్ యాదవ్ బావమరిది బిధున ప్రమోద్ గుప్తా.. సమాజ్‌వాదీకి గుడ్‌బై చెప్పారు. గురువారం భారతీయ జనతా పార్టీ (భాజపా)లో చేరారు. కాంగ్రెస్ నేత ప్రియాంక మౌర్య సైతం కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. మహిళా సాధికారతకు కాంగ్రెస్ అధిక ప్రాధాన్యమిస్తుందని చాటిచెప్పేలా.. ప్రియాంక గాంధీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'లడ్కీ హూ.. లడ్ సక్తీ హూ' కార్యక్రమానికి ప్రియాంక మౌర్య పోస్టర్ గర్ల్ కావడం గమనార్హం.
UP Assembly polls 2022
భాజపాలో చేరనున్నట్లు ప్రమోద్ గుప్తా ఇదివరకే ప్రకటించారు. తనతో పాటు సమాజ్‌వాదీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు భాజపాలో చేరనున్నారని చెప్పారు. దీనిపై వారు సంప్రదింపులు జరుపుతున్నారని, భాజపా అధిష్ఠానం నుంచి అనుమతి రాగానే పార్టీలో చేరతారని వెల్లడించారు.
Aparna Yadav UP assembly polls
ఇప్పటికే ములాయం కోడలు అపర్ణా యాదవ్ భాజపాలో చేరారు. ఉత్తర్‌ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, భాజపా యూపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్.. ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
అపర్ణా యాదవ్ అన్ని అడ్డంకులను దాటుకొని భాజపాలో చేరారని ప్రమోద్ గుప్తా పేర్కొన్నారు. ములాయం సింగ్ యాదవ్ ఆశిస్సులతోనే పార్టీ మారారని చెప్పారు. తనకు అప్పగించిన పనిని అపర్ణ సమర్థంగా నెరవేరుస్తారని అన్నారు.
అఖిలేశ్ ఎద్దేవా!
మరోవైపు, అపర్ణ భాజపాలోకి వెళ్లడంపై తనదైన శైలిలో స్పందించారు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్. ఆమె తమ పార్టీ సిద్ధాంతాలను భాజపాలోకి తీసుకెళ్తారని ఆశిస్తున్నట్లు బుధవారం పేర్కొన్నారు. తమ పార్టీ టికెట్లు ఇవ్వలేని వారికి భాజపా టికెట్లు ఇస్తుందని, ఇందుకు ఆ పార్టీకి కృతజ్ఞతలంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అలాగే ఆమె పార్టీ వీడకుండా నేతాజీ(ములాయం సింగ్) ఒప్పించే ప్రయత్నం చేశారని తెలిపారు.
ఇదీ చదవండి: ఎవరీ అపర్ణా యాదవ్- భాజపాలో చేరికతో ఎవరికి లాభం?