కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా కరోనాతో మృతి చెందారు. ఇటీవల వైరస్ బారినపడిన ఆయన.. బుధవారం చికిత్స పొందుతూ మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
జగన్నాథ్ 1980-81లో రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. హరియాణా, బిహార్ రాష్ట్రాలకు గవర్నర్‌గానూ విధులు నిర్వహించారు.
ప్రధాని మోదీ సంతాపం..
పహాడియా మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. పహాడియా.. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో సామాజిక సాధికారతకు ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు.
గహ్లోత్ కూడా..
మాజీ సీఎం మృతిపట్ల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సంతాపం తెలిపారు. మొదటి నుంచీ పహాడియా తనకు శ్రేయోభిలాషిలా ఉండేవారని గుర్తుచేసుకున్నారు. గురువారం రాష్ట్ర అధికారిక లాంఛనాలతో పహాడియా అంత్యక్రియలు జరగనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:తౌక్టే విలయం: ఆ నౌకలో 26 మంది మృతి