మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ రాసిన లేఖ తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతోంది. హోమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తన పదవిని దుర్వినియోగం చేశారని ఆరోపించారు పరమ్‌బీర్ సింగ్. కాగా ఆయన ఆరోపణలను దేశ్‌ముఖ్ ఖండించారు. మరోవైపు ఈ పుర్తి వ్యవహారంపై విచారణ చేపట్టాలని భాజపా నేత ఫడణవీస్ డిమాండ్ చేశారు.
'నెలకు రూ. 100కోట్లు...'
లేఖల్ తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ముంబయి మాజీ పోలీస్ కమిషనర్. నెలకు రూ.100 కోట్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు.. పోలీసు అధికారి సచిన్ వాజేతో హోంమంత్రి చెప్పారని పేర్కొన్నారు.
'పరమ్ భయపడుతున్నారు...'
పరమ్ ఆరోపణలను హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఖండించారు. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసుతో పాటు మన్సుఖ్ హిరేన్ మృతి కేసులో విచారణ జరుగుతోందని.. అది చూసి పరమ్ భయపడుతున్నారని ఆరోపించారు. అవి ఆయనవైపునకు వస్తున్నాయనే కారణంతోనే.. తనపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
తనపై పరమ్‌బీర్ సింగ్ చేసిన ఆరోపణలను నిరూపించాలని అనిల్ దేశ్‌ముఖ్ అన్నారు. పరమ్పై పరువునష్టం దావా వేస్తున్నట్లు తెలిపారు.
'హోంమంత్రి రాజీనామా చేయాలి...'
పరమ్‌బీర్ సింగ్ లేఖ నేపథ్యంలో భాజపా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హోం మంత్రి రాజీనామా చేయాలని లేదా.. ఆయనను ముఖ్యమంత్రే తొలగించాలని భాజపా నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ డిమాండ్ చేశారు. దీనిపై నిష్పాక్షిక దర్యాప్తు చేపట్టాలని అన్నారు. హోంమంత్రిపై ఆరోపణల గురించి సీఎంకు ముందే తెలిసినా.. ఆయన ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు నేపథ్యంలో.. ముంబయి పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే బదిలీ చేసింది. పరమ్‌బీర్ సింగ్ స్థానంలో హేమంత్ నగ్రాలేను నియమించింది.
కారు యజమానిగా పేర్కొన్న మాన్సుఖ్ హిరెన్ మృతి, అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాలకు సంబంధించి అనుమానిస్తూ పోలీస్ అధికారి వాజేను ఎన్ఐఏ ఇటీవలే అరెస్ట్ చేసింది. అంబానీ నివాసం వద్ద సీసీటీవీలో కనిపించిన వ్యక్తి వాజేనే అని ఏన్ఐఏ అనుమానిస్తోంది.
ఇదీ చూడండి:వాజేను 'మహా' సర్కారే కాపాడుతోంది: ఫడణవీస్