Supreme Court proceedings live: సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారిగా కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారం అయ్యాయి. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ చేయనున్న ఆగస్టు 26న సుప్రీంకోర్టు లైవ్ ప్రొసీడింగ్స్ ప్రారంభమయ్యాయి. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ హిమా కోహ్లీతో బెంచ్‌ను పంచుకున్నారు. ఈ త్రిసభ్య ధర్మాసనం విచారణలు జరుపుతోంది. తొలిసారిగా సుప్రీంకోర్టులో విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేశారు. దీంతో సుప్రీంకోర్టును ప్రజలకు చేరువచేసే క్రమంలో మరో ముందడుగు పడింది.
రాజకీయ పార్టీల ఉచిత హామీలు, కర్ణాటకలో ఇనుప గనుల మైనింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ వివాదాస్పద వ్యాఖ్యల కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలు వీక్షించే అవకాశం కల్పించారు. వాస్తవానికి సుప్రీంకోర్టు ప్రోసీడింగ్స్ ప్రత్యక్షప్రసారం చేసేందుకు 2018లో అనుమతించారు. రాజ్యాంగం, జాతీయ ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని.. అప్పట్లో రాజ్యాంగ ధర్మాసనం ముందుకు వచ్చే కొన్ని కేసుల ప్రత్యక్ష ప్రసారానికి అంగీకారం తెలిపింది. సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం చేపట్టే ముఖ్యమైన కేసులను మొదట ప్రత్యక్షప్రసారం చేయవచ్చని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ గతంలో సూచించారు. ఈ మేరకు జస్టిస్ ఎన్వీ రమణ 2021 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రత్యక్ష ప్రసారం చేసే అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు.
ఏకాభిప్రాయంతోనే ఈ ప్రక్రియ చేపట్టాలన్న ఆయన శుక్రవారం దానికి కార్యరూపునిచ్చారు. సాంకేతికతను న్యాయవ్యవస్థ అందిపుచ్చుకోవాలని ఇవాళ్టి విచారణలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. న్యాయవ్యవస్థలో అవసరమైన మార్పులు తెచ్చేందుకు శాయశక్తులా కృషి చేశానని గుర్తుచేసుకున్నారు.
భారత ప్రధాన న్యాయమూర్తిగా శుక్రవారం పదవీ విరమణ చేయనున్నారు జస్టిస్ ఎన్వీ రమణ. సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ విశేష సేవలు అందించారు. న్యాయవాది నుంచి సీజేఐ స్థాయికి ఎదిగారు. 13 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జిగా పనిచేశారు జస్టిస్ ఎన్వీ రమణ. సీజేఐగా 2021 ఏప్రిల్‌లో బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ కోకా సుబ్బారావు తర్వాత సుదీర్ఘకాలం సీజేఐగా చేసిన తెలుగు వ్యక్తిగా రికార్డు సృష్టించారు జస్టిస్ ఎన్వీ రమణ.
జస్టిస్ ఎన్.వి.రమణ పదవీవిరమణ సందర్భంగా ఆయన పనితీరుపై ప్రశంసలు కురిపించారు. సీజేఐగా ఉన్నత ప్రమాణాలు నెలకొల్పారన్న వారు న్యాయవ్యవస్థకు జస్టిస్ రమణ చేసిన సేవలు మరవలేనివని పేర్కొన్నారు. కార్యనిర్వాహక, పార్లమెంటరీ, న్యాయ వ్యవస్థల మధ్య సమతూకం పాటించారంటూ కొనియాడిన సీనియర్ న్యాయవాది ధుష్యంత్ దవే ఒకదశలో తీవ్ర భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. జస్టిస్ రమణ ప్రజల న్యాయమూర్తి అంటూ పొగడ్తలతో దవేతోపాటు కపిల్ సిబల్ కొనియాడారు. సుప్రీంకోర్టు హుందాతనం, సమగ్రతను పరిరక్షించారని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: హైకోర్టుల్లో 224 మంది న్యాయమూర్తులను నియమించిన సీజేఐ
న్యాయపాలనా దక్షుడు, వాస్తవికవాది, అత్యుత్తమ భారత ప్రధాన న్యాయమూర్తి