ఇటుకలను ఒకదానిపై ఒకటి పేర్చుతూ గోడ కట్టడం అందిరికీ తెలిసిందే. కానీ, ఇటుకలు గాల్లో తేలియాడేలా ఉన్న గోడను చూశారా? వింటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ, గుజరాత్ సూరత్‌కు చెందిన ఓ ఆర్కిటెక్ట్ చేసి చూపించారు. ముందుభాగంలో ఇటుకలు గాల్లో తేలుతున్నాయా? అని అనుకునేలా సరికొత్తగా రూపొందించారు. సముద్రం అలల మాదిరిగా కనిపిస్తున్న ఈ డిజైన్ చూసి స్థానికులు ఆశ్చర్యంలో మునిగితేలుతున్నారు.
కోసాడ్ ప్రాంతంలో.. చూపరులను తెగ ఆకర్షిస్తోన్న ఈ ఇంటి ముందుభాగాన్ని నిర్మించింది ఆర్కిటెక్ట్ ఆశిష్ పటేల్. ఇటుకల వరుస మధ్య 2 నుంచి 3 అంగుళాల దూరం ఉండేలా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఇది అంతర్జాతీయ అవార్డుకు ఎంపికైంది.
"ఇంగ్లాండ్‌లోని బ్రిక్ డెవలమెంట్ అసోసియేషన్ సంస్థ ఈ 'బ్రిక్ అవార్డు 2021' అందజేస్తుంది. ఇటుకలు ఉపయోగించి ఏ ఆర్కిటెక్ట్ అయినా క్రియేటివ్‌గా నిర్మాణం చేపడితే.. ఈ అవార్డు ఇస్తుంది. వరల్డ్ వైడ్ కేటగిరీలో మా ప్రాజెక్టు నామినేట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోని సంస్థ అయినా ఇందులో పోటీ చేయవచ్చు."
-ఆశిష్ పటేల్, ఆర్కిటెక్ట్.
ఈ అవార్డు కోసం చాలా సంస్థలు పోటీ పడ్డాయని ఆశిష్ చెప్పారు. బెల్జియంకు చెందిన మూడు ప్రాజెక్టులు, స్విట్జర్లాండ్, బ్రిటన్, ఇరాన్, చైనా నుంచి ఒక్కో ప్రాజెక్టు.. ఈ అవార్డుకు నామినేట్ అయ్యాయని చెప్పారు. భారత్ తరఫున తమ ప్రాజెక్టు బ్రిక్స్ అవార్డుకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని చెప్పారు. నవంబర్ 10న లండన్ వేదికగా ఈ అవార్డు తీసుకోనున్నట్లు ఆశిష్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:సీఎం కీలక నిర్ణయం- పూజారులుగా బ్రాహ్మణేతరులు