Five state election 2022: వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకు 'కొవిడ్' ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయాలని నిర్ణయించింది భారత ఎన్నికల సంఘం. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్‌పై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ఈ భేటీలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్.. దేశంలో ఒమిక్రాన్ పరిస్థితులను ఈసీకి వివరించారు. జిల్లాల వారీగా ఆర్-వాల్యూ, వ్యాక్సినేషన్ వంటి సమాచారం అందించారు. కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో జిల్లా స్థాయిలో ఆంక్షలు విధించాల్సిన అవసరాన్ని ఆరోగ్య కార్యదర్శి వివరించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో.. వ్యాక్సినేషన్ అవసరాన్ని ఎన్నికల సంఘం నొక్కి చెప్పినట్లు పేర్కొన్నాయి.
షెడ్యూల్ రూపొందించేందుకు ఈసీ సమాయత్తమవుతున్న తరుణంలో ఈ సమీక్షా సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
యూపీ పర్యటన!
మరోవైపు, ఎన్నికల భద్రతా ఏర్పాట్లపైనా ఈసీ సమాలోచనలు జరిపింది. బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, ఐటీబీపీ డీజీలతో విడివిడిగా సమీక్షా సమావేశాలు నిర్వహించింది. పారామిలీటరీ బలగాల తరలింపు అంశంపై చర్చించింది. మంగళవారం ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈసీ అధికారులు పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఇదివరకే పలుమార్లు ఈసీ అధికారులు పర్యటించారు. ఆయా రాష్ట్రాల్లో స్థానికంగా ఉన్న పరిస్థితులను సమీక్షించారు. తుది నిర్ణయం తీసుకునే ముందు ఆరోగ్య శాఖ అధికారుల అభిప్రాయం సైతం తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈ సమీక్షా సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం అయిదు రాష్ట్రాల ఎన్నికలపై ముందుకెళ్లే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ఎస్పీ నేత పీయూష్ జైన్ అరెస్టు- మరో రూ.10 కోట్లు సీజ్