పంజాబ్లోని లుథియానాలో విషాద ఘటన జరిగింది. బిహార్ నుంచి వలస వచ్చిన కుటుంబం ఉంటున్న గుడిసె అగ్నికి ఆహుతై ఏడుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో రెండేళ్ల చిన్నారి సైతం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని టిబ్బారోడ్డులో ఉన్న మున్సిపల్ డంపింగ్ యార్డుకు సమీపంలోని గుడిసెలో నిద్రిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఏసీపీ సురిందర్ సింగ్ తెలిపారు.
మృతులు సురేశ్ సాహ్ని(55), అతడి భార్య రీనా దేవి(53)తో పాటు వారి ఐదుగురు పిల్లలు రేఖీ, మీనాక్షి, గీతా, చాందా, రెండేళ్ల సన్నీగా టిబ్బా పోలీస్ స్టేషన్ ఇంఛార్జి రన్బిర్ సింగ్ గుర్తించినట్లు చెప్పారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. ఏప్రిల్ 30న తన పెద్ద కూతురి వివాహం కోసం గురువారమే సొంత ఊరికి బయలుదేరేందుకు సిద్ధమయ్యారని, ఆలోపే ఈ ప్రమాదం జరిగిందని మృతుడి బంధువు రామ్బాబు సాహ్నీ తెలిపారు. వేరే ప్రాంతంలో నిద్రిస్తున్న వీరి మరో కుమారుడు రాజేశ్(17) ఒక్కడే ప్రాణాలతో మిగిలారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారమందుకున్న వెంటనే సుందర్ నగర్ నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారని.. అయితే, అప్పటికే వీరంతా మరణించారని అగ్నిమాపక అధికారులు తెలిపారు.
సురేశ్ సాహ్నీ 25 ఏళ్ల క్రితం బిహార్ నుంచి లుథియానాకు వచ్చినట్లు పొరుగు వ్యక్తి బిందేశ్ శర్మ తెలిపారు. మంటలు చెలరేగే కొద్ది సమయానికి ముందు ఓ ద్విచక్రవాహనం అటువైపుగా వెళ్లిన్నట్లు చూశామని పోలీసులకు చెప్పారు. ఈ కోణంలో దర్యాప్తు చేపట్టాలని కోరారు. అయితే.. ప్రాథమిక విచారణలో ఎలాంటి అనుమానాస్పదంగా పరిస్థితులు కనిపించలేదని పోలీసు అధికారి తెలిపారు. ఫొరెన్సిక్ బృందం నమూనాలు సేకరించింది. సమీపంలోని రెండు సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. బంధువులకు సమాచారం అందించి.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఇదీ చూడండి: అప్పటివరకు పెళ్లిలో సరదా సరదాగా.. కాసేపటికే ఆరుగురు శవాలై...