మహారాష్ట్రలో మరో విషాదం చోటు చేసుకుంది. పాల్గఢ్ జిల్లా వాసాయిలోని విజయ్ వల్లభ్ ఆస్పత్రి రెండో అంతస్తులో ఉన్న ఐసీయూలో మంటలు చెలరేగడం వల్ల.. చికిత్స పొందుతున్న 14 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, తొమ్మిది మంది పురుషులు ఉన్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మంటలు చెలరేగాయని స్పష్టం చేశాయి.
ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఆస్పత్రిలో ఫర్నీచర్, ఇతర సామగ్రి మొత్తం కాలి బూడిదయింది.
ఏసీ వల్లే!
ఐసీయూలోని ఏసీ యూనిట్‌లో పేలుడు కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గురువారం నుంచి ఐసీయూలో ఏసీ పనిచేయడం లేదని.. దానికి మరమ్మతులు జరగుతున్నాయని ఆస్పత్రి సిబ్బంది ఒకరు తెలిపారు. ఆస్పత్రిలోని ఏసీ వ్యవస్థలో సమస్య ఉందని వివరించారు.
"అగ్ని ప్రమాద సమయంలో ఆస్పత్రిలో మొత్తం 90 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో 18 మంది ఉన్నారు. నలుగురిని ప్రమాదం నుంచి రక్షించాం. ఆస్పత్రిలోని ఇతర విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగులు సురక్షితంగా ఉన్నారు."
--డాక్టర్ దిలీప్ షా, వల్లభ్ కొవిడ్ కేర్ హాస్పిటల్ డైరెక్టర్.
శోకసంద్రంలో..
అగ్ని ప్రమాద సమయంలో.. ఆస్పత్రి సిబ్బంది నిద్రపోతున్నారని, రోగులను బయటకు తీసుకొచ్చేందుకు ఐసీయూలో ఒక్కరు కూడా లేరని మృతుల బంధువులు ఆరోపించారు. ఆస్పత్రిలో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సామగ్రి లేదని విమర్శించారు. భద్రతా ప్రమాణాలు పాటిస్తే మృతులందరూ బతికే వారని అన్నారు. అగ్ని ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులు డిమాండ్ చేశారు.
దర్యాప్తునకు ఆదేశం..
అగ్ని ప్రమాద ఘటనపై స్పందించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే.. సమగ్ర దర్యాప్తు జరపాలని ఆదేశించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు కేంద్రం కూడా ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.
ప్రముఖుల దిగ్భ్రాంతి..
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
"ఆసుపత్రిలో జరిగిన విషాద ఘటన నన్ను కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా."
--రాజ్‌నాథ్‌సింగ్, రక్షణమంత్రి
అగ్ని ప్రమాదంలో కొవిడ్ రోగులు మరణించిన వార్త తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు.
"ఇది చాలా బాధాకరమైన ఘటన. మృతుల కుటుంబాల పట్ల సానుభూతి తెలుపుతున్నాను."
--రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత.
నాసిక్‌లో ఆక్సిజన్ ట్యాంకర్ లీకై 24 మంది మరణించిన ఘటనను మరవక ముందే.. మరో ఘోరం జరగడం ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. మహారాష్ట్రలో ఇప్పటికే కరోనా కాటుకు నిత్యం వందల మంది మరణిస్తుండగా ఆస్పత్రుల్లో వరుస ప్రమాదాలు కూడా రోగులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.
ఇదీ చదవండి:కరోనా నిధులన్నీ కార్పొరేట్లకే!