Fire at IOC refinery: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. మరో 44 మంది గాయపడ్డారు. బంగాల్ పూర్వ మెదినీపుర్ జిల్లాలోని హల్దియా ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది.
రిఫైనరీలోని ఓ యూనిట్ మూసివేత పనులు జరుగుతుండగా.. ఈ ప్రమాదం జరిగిందని ఐఓసీ ఓ ప్రకటనలో తెలిపింది. మంటలు అదుపులోకి వచ్చాయని పేర్కొంది. ఈ ప్రమాదం గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారని చెప్పింది
క్షతగాత్రుల్లో 37 మందిని కోల్కతాలోని ఓ ఆస్పత్రికి 'గ్రీన్ కారిడార్' మీదుగా తరలించారని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.
సీఎం దిగ్భ్రాంతి..
ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించడంపై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. "ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ముగ్గురి వ్యక్తుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకునేందుకు అన్ని రకాలుగా ప్రభుత్వం సాయం చేస్తుంది" అని ఆమె ట్వీట్ చేశారు.