వివాదాస్పద 'దిల్లీ' బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించింది. మంగళవారం లోక్సభలో ఆమోదం పొందగా.. ఇవాళ రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం దిల్లీ ప్రభుత్వమంటే.. లెఫ్టినెంట్ గవర్నర్ అని, కార్యనిర్వహణకు సంబంధించి దిల్లీ ప్రభుత్వం తప్పనిసరిగా ఆయన అభిప్రాయం తీసుకోవాలని పొందుపరిచారు. అయితే.. దిల్లీ ప్రభుత్వం నుంచి అధికారాన్ని లాక్కునేందుకు ఈ బిల్లును తీసుకువచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధ చర్య అని కాంగ్రెస్ విమర్శించింది.
'ప్రజాస్వామ్యంలో చెడ్డ రోజు'
పార్లమెంటులో దిల్లీ బిల్లు ఆమోదంపై దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజును ప్రజాస్వామ్యంలో చెడ్డ రోజుగా అభివర్ణించారు. తిరిగి ప్రజల చేతిలోకి అధికారం తీసుకొచ్చేంత వరకూ పోరాడతామన్నారు.
లోక్సభలో రణరంగం
'దిల్లీ' బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టే క్రమంలో విపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధం అని.. బిల్లును తిరిగి సెలక్ట్ కమిటీకి పంపించాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడింది. బీజేడీ, ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు వాకౌట్ చేశాయి. మూజువాణి ఓటుతో రాజ్యసభలో దిల్లీ బిల్లు ఆమోదం పొందింది. సభలో 83 మంది ఈ బిల్లుకు మద్దతు తెలపగా.. 45 మంది బిల్లును వ్యతిరేకించారు.
జువెనైల్ బిల్లుకు ఆమోదం
జువెనైల్ జస్టిస్ బిల్లుకు పార్లమెంట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు వల్ల 'పిల్లల సంరక్షణ, దత్తత తీసుకోవటం'పై నియమాలను బలోపేతం చేసేందుకు ఈ చట్టం తీసుకొచ్చారు.
ఆర్థిక బిల్లుకు ఆమోదం
2021- ఆర్థిక బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును మంగళవారం లోక్సభ ఆమోదం తెలపగా.. బుధవారం రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లు ద్వారా 2021-22 ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి ఆర్థికరంగానికి సంబంధించిన ప్రతిపాదనలు చేయనుంది.
ఇదీ చదవండి : కొవిడ్ నీడలో.. 5 రాష్ట్రాల్లో ఎన్నికలకు ఈసీ సన్నద్ధం!