ఆ వ్యక్తికి అప్పటికే నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి. ఏడుగురు పిల్లలున్నారు. అయినప్పటికీ మరో వివాహానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసి అతడి రెండో భార్య, ఏడుగురు పిల్లలు, బంధువులు అక్కడికి వెళ్లి ఆ వివాహాన్ని అడ్డుకున్నారు. భార్య, పిల్లలు అతడిపై దాడి చేసి కొట్టారు. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్‌కు గురైన వధువు అక్కడి నుంచి భయపడి పారిపోయింది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపుర్ జిల్లాలో జరిగింది.
అసలేం జరిగిందంటే? జిల్లాలోని మొహల్లా పటియాకు చెందిన 55 ఏళ్ల ఓ వ్యక్తి రోడ్డు కాంట్రాక్టర్. అతడికి గతంలోనే నాలుగు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రెండో వివాహం చేసుకున్నాడు. రెండో భార్యకు ఏడుగురు సంతానం కలిగారు. అయితే గత ఆరునెలల నుంచి రెండో భార్యకు దూరంగా ఉంటున్న అతడు ఆమెకు సైతం విడాకులు ఇచ్చాడు. అనంతరం రహస్యంగా మరో రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన కూతురు తెలిపింది. అయితే మంగళవారం రాత్రి రహస్యంగా మరో పెళ్లి చేసుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఇంతలో ఈ సమాచారం తన రెండో భార్య, పిల్లల చెవిన పడడంతో వారు పెళ్లి జరుగుతున్న ప్రాంతానికి బంధువులతో సహా వచ్చి అడ్డుపడ్డారు. అతడిపై దాడి చేసి కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
ఇవీ చదవండి:
ఏడు నెలల గర్భిణికి ఆపరేషన్.. పిండం వృద్ధి చెందలేదని లోపల పెట్టి కుట్లు వేసిన డాక్టర్
దేశంలో ఎక్కడున్నా ఆ బడిలో చేరొచ్చు.. తొలి వర్చువల్ స్కూల్ ప్రారంభం