మధ్యప్రదేశ్ నర్సింగపుర్లో దారుణం జరిగింది. కన్న కుమారుడిని హతమార్చాడు ఓ తండ్రి. గోట్గావ్ పోలీస్ పరిధిలో నివసిస్తున్న కేదార్ పటేల్.. ఇంట్లో భోజనం చేస్తుండగా అతడి ముందు పిల్లి వచ్చి ఆగింది. పిల్లిని కొట్టి బయటకు పంపాలని కేదార్ పటేల్ తన కుమారుడు అభిషేక్ పటేల్‌ను కోరాడు. తండ్రి మాటను అభిషేక్ పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన కేదార్.. మొదట పిల్లిని పట్టుకుని చంపేశాడు. అనంతరం కుమారుడిపై కూడా పదునైన ఆయుధంతో మెడపై దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడు కేదార్‌ను అరెస్ట్ చేశారు. అభిషేక్ మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
యువకుడిని మింగిన మొసలి..
బిహార్ ముజఫర్‌నగర్‌లోని భవానీపుర్‌లో దారుణం జరిగింది. ఛఠ్ పూజ సందర్భంగా భాగ్మతి నదిలో స్నానానికి వెళ్లిన యువకుడిని మొసలి మింగేసింది. మృతుడిని శ్రవణ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. మొసలి యువకుడిని మింగేస్తున్న సమయంలో పలువురు భక్తులు అక్కడే ఉన్నా.. ఎవరూ భయంతో యువకుడిని రక్షించేందుకు వెళ్లలేదు. గత కొన్ని రోజులుగా నది ఒడ్డున మొసళ్లు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అంతకుముందు కూడా ఓ మత్స్యకారుడిపై మొసళ్లు దాడి చేశాయని అయితే అతడు ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘాట్‌కు చేరుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాల సహాయంతో యువకుడి కోసం వెతుకులాట ప్రారంభించారు.
వాచ్మెన్ హత్య..
బిహార్‌లోని మాధేపురాలో దారుణం జరిగింది. నేరస్థుడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన వాచ్‌మన్‌ను దుండగులు కాల్చి చంపారు. ఓ విగ్రహం నిమజ్జన కార్యక్రమంలో వాచ్మెన్ గురుదేవ్ పాశ్వాన్, అరబింద్ పాశ్వాన్ పాల్గొన్నారు. ఈ క్రమంలనే.. నేరస్థుడు, మద్యం వ్యాపారి అమిత్రామ్.. వాచ్మెన్ కంటపడ్డాడు. గురుదేవ్ ధైర్యం చేసి అమిత్రామ్ను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. వీరి మధ్య కాసేపు తోపులాట జరిగింది. ఆ తర్వాత నిందితుడి సహచరులు నలుగురు వచ్చి.. తుపాకీతో గురుదేవ్ తలపై కాల్పులు జరిపారు. దీంతో గురుదేవ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వాచ్‌మన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: ఇండిగో విమానంలో మంటలు.. టేకాఫ్ సమయంలో ఇంజిన్ ఫెయిల్.. లక్కీగా..