Father Killed Sick Son: ఉత్తరాఖండ్‌లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి ఖర్చులు భరించలేక సొంత బిడ్డనే గొంతుపిసికి హత్య చేశాడో తండ్రి. ఈ దారుణ ఘటన ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని రుద్రాపుర్‌లో జరిగింది.
మహమ్మద్ తారిక్ స్థానికంగా ట్రక్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి షాబన్ రజా అనే మూడున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల రజా.. హీమోఫీలియా అనే జబ్బుతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం తారిక్ స్తోమతకు మించి ఖర్చుచేశాడు. ఈ క్రమంలో అప్పులు కూడా చేశాడు. ఇంకా కుమారుని జబ్బు నయం కాలేదు. స్థానిక వైద్యులు దిల్లీలో పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లమన్నారు. కానీ ఆర్థికంగా చితికిపోయిన తారిక్ ఇక భరించలేననుకుని.. కుమారున్ని చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహేఢీ జిల్లా, డాకియాలో ఓ కాలువవైపు కుమారునితో కలిసి వెళ్లాడు. చిన్నారిని అక్కడే గొంతుపిసికి పొదల్లో పడేశాడు. ఎప్పటిలాగే ఇంటికి వచ్చేశాడు.
సాయంత్రానికి కుమారుడు కనిపించకపోయేసరికి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో సీసీటీవీ ఆధారాలతో తారిక్‌ను ప్రశ్నించగా.. నేరం ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టానికి పంపించారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: పెళ్లి వేడుకలో ఘోరం... బావిలో పడి 13 మంది మహిళలు మృతి