Father And Sons Swimming Record In Tehri Lake : లైఫ్ జాకెట్ లేకుండానే 15 కిలోమీటర్లు ఈత కొట్టి రికార్డు సృష్టించారు ఉత్తరాఖండ్‌కు చెందిన తండ్రి, ఇద్దరు కుమారులు. కేవలం 5 గంటల 30 నిమిషాల్లోనే ఈత కొట్టి.. తమ రికార్డును తామే తిరగరాసుకున్నారు.
లైఫ్ జాకెట్లు లేకుండానే..
అడ్వెంచరెస్ క్రీడలను ఇష్టపడేవారి కోసం ప్రతి ఏటా ఆసియాలోనే అత్యంత ఎత్తైన తెహ్రీ డ్యామ్‌లో ప్రత్యేక స్విమ్మింగ్ పోటీలను నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే తెహ్రీ జిల్లా ప్రతాప్‌నగర్‌లోని మోత్నా గ్రామానికి చెందిన త్రిలోక్ సింగ్ రావత్(50), ఆయన కుమారులు రిషభ్ రావత్(20), పరస్వీర్ రావత్(17) ముగ్గురు ఈ పోటీల్లో పాల్గొన్నారు. సోమవారం ఈ స్విమ్మింగ్ పోటీలు ప్రారంభం కాగా.. వీటిలో భాగంగా ఉదయం 8 గంటలకు తండ్రీకొడుకులు కలిసి కోటి కాలనీ నుంచి సయాసు వంతెన వరకు ఈత కొట్టడం ప్రారంభించారు. సుమారు 3 గంటల పాటు ఈత కొడుతూ ముగ్గురూ బల్దియానా ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో అప్పటికే వీరి పేరిట ఉన్న 12.25 కిలోమీటర్ల రాష్ట్ర స్థాయి రికార్డు సమమైంది. అనంతరం దాన్ని అధిగమించి కొత్త రికార్డును నెలకొల్పేందుకు మరింత ముందుకు ఈదుకుంటూ వెళ్లారు. అలా కోటి కాలనీ నుంచి కందిసౌడు ప్రాంతంలోని సయాసు వంతెన వద్దకు స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్లారు. దీంతో మొత్తం 15 కిలోమీటర్ల లక్ష్యాన్ని కేవలం 5 గంటల 30 నిమిషాల్లోనే పూర్తి చేశారు. అయితే 2021లో పాల్గొన్న పోటీలతో పాటు.. తాజాగా కూడా వీరు లైఫ్ జాకెట్ ధరించకుండానే స్విమ్మింగ్ చేయడం విశేషం.
తండ్రిని మించిన తనయులు!
2021 సెప్టెంబర్ 30న నిర్వహించిన ఈ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్న తండ్రీకొడుకులు మొత్తం 12.25 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేశారు. రిషభ్ రావత్, పరస్వీర్ రావత్‌లు ఇద్దరు కలిసి మూడున్నర గంటల్లోనే పూర్తి చేయగా.. తండ్రి త్రిలోక్ సింగ్ రావత్ నాలుగున్నర గంటల సమయం తీసుకున్నారు. తెహ్రీ సరస్సులో ఇంత దూరం ఈత కొట్టిన తొలి వ్యక్తులుగా వీరు నిలిచారు. కాగా, ఇందుకోసం వీరు జిల్లా యంత్రాంగం నుంచి విధిగా అనుమతులు తీసుకున్నారు.