కశ్మీర్‌లో న్యాయం జరగకపోతే టార్గెట్ హత్యలు ఆగవని మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా పేర్కొన్నారు. ఇటీవల దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో మైనార్టీలైన పండిట్ వర్గానికి చెందిన పూర్ణ కృష్ణ భట్ హత్యకు ఆర్టికల్ 370 తొలగింపే ఓ రకంగా కారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫరూఖ్ మాట్లాడుతూ "న్యాయం జరిగే వరకు ఇవి ఆగవు. గతంలో వారు ఆర్టికల్ 370 ఉండటం వల్లే ఇటువంటి హత్యలు జరిగాయని చెప్పారు. ఇప్పుడు దానిని తొలగించారు. కానీ, హత్యలు మాత్రం ఎందుకు ఆగలేదు? దీనికి ఎవరు బాధ్యులు..?" అని అబ్దుల్లా ప్రశ్నించారు.
శనివారం ఉదయం పూర్ణ కృష్ణ భట్‌ను షోపియాన్ జిల్లాలోని ఆయన పూర్వీకుల ఇంటి వద్ద ఉగ్రవాదులు కాల్చారు. తూటా గాయాలతో ఉన్న ఆయన్ను జిల్లా ఆసుపత్రి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఈ దాడికి కశ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్స్ బాధ్యత తీసుకొంది. ఆయన మృతదేహానికి ఆదివారం ఉదయం జమ్ములో అంత్యక్రియలు జరిగాయి. మృతుడికి భార్య, పాఠశాల విద్యాభ్యాసం చేస్తున్న కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో కశ్మీర్‌లో టార్గెట్ హత్యలపై అక్కడి మైనార్టీ వర్గాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. కశ్మీర్‌లో హిందువులు సురక్షితంగా లేరని కృష్ణ భట్ సోదరి నీలమ్ మీడియా వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: యూట్యూబ్ చూసి బిడ్డకు జన్మనిచ్చిన మైనర్! శిశువును ఏం చేసిందంటే?
చెరుకు కోసం చెక్‌పోస్ట్‌కు అడ్డంగా ఏనుగుల గుంపు. వాహనదారులకు ఇక్కట్లు