సాగు చట్టాలపై జరుగుతున్న ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని రైతు సంఘాల నేతలు నిర్ణయించారు. దేశవ్యాప్తంగా 'కిసాన్ షహీద్ యాత్ర' నిర్వహించాలని సంకల్పించారు. కన్యాకుమారి నుంచి దిల్లీ వరకు యాత్ర చేయడానికి పూనుకున్నారు. యాత్రలో అమరులైన రైతుల అస్థికలు సేకరించనున్నారు. ఈ మేరకు రైతు సంఘాల నేతలు జరిపిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా సింఘు సరిహద్దు వద్ద గత నాలుగున్నర నెలల నుంచి రైతులు ఉద్యమిస్తున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు రాస్తారోకోలు, ధర్నాలు, బంద్‌లు నిర్వహించారు. కానీ ఇవేవి కేంద్రాన్ని కదిలించలేకపోయాయి. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
''ఇప్పటివరకు 351 మంది రైతులు అమరులయ్యారు. రైతులందరం ఏకమై కిసాన్ షహీద్ యాత్రను నిర్వహించనున్నాం. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా, ఇవ్వకున్నా ర్యాలీ నిర్వహించి తీరుతాం.''
- భోపాల్ సింగ్ చౌధరి, భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి
యాత్రలో దాదాపు 1500 మంది రైతులు పాల్గొననున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: ఎరువుల ధరాఘాతం.. రైతులపై పిడుగు