సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన కొనసాగిస్తున్న రైతులకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. పలు రాష్ట్రాల్లోని అన్నదాతలు నిరసనలు తెలిపారు. హరియాణా మానేసర్‌లోని దిల్లీ-జైపుర్ ఎక్స్‌ప్రెస్‌వే వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొందరు రైతులు నిరసనకు దిగారు.
బంగాల్లో..
బంగాల్‌లోనూ రైతు ఆందోళనలు జరిగాయి. కోల్‌కతాలోని క్రిసక్ సంహతి పరేడ్‌లో వామపక్ష నేతలు కవాతు నిర్వహించారు. వామపక్షాలకు చెందిన 16 పార్టీలు.. దిల్లీలో నిరసనలు చేస్తున్న రైతులకు మద్దతుగా నిలిచారు.
కర్ణాటకలోనూ..
కర్ణాటకలోనూ రైతులు ఆందోళనలు చేశారు. దిల్లీలోని రైతులకు మద్దతుగా రాష్ట్రంలోని నలుమూలల నుంచి బెంగళూరుకు చేరుకున్న రైతులు నిరసనలకు దిగారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ చండీగఢ్‌లో నిరసన ర్యాలీలు నిర్వహించారు రైతులు. దిల్లీలోని రైతుల ట్రాక్టర్ ర్యాలీకి మద్దతుగా యువత బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఇంటికి పయనం
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మహారాష్ట్ర ముంబయిలోని ఆజాద్ మైదానంలో భారీ సభకు హాజరైన రైతులు ఇంటిముఖం పట్టారు. నిరసనల్లో పాల్గొన్న ఓ వృద్ధురాలు.. జాతీయ జెండాను ఎగురవేసిన తర్వాత తమ స్వస్థలాలకు తిరిగు పయణమయ్యారని అఖిల భారత కిసాన్ సభ తెలిపింది.
ఇదీ చూడండి: ట్రాక్టర్ ర్యాలీలో హింసపై షా సమీక్ష