కొత్త సాగు చట్టాలపై రైతులు, కేంద్రం మధ్య 9వ విడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాల నేతలు మరోసారి స్పష్టం చేశారు. అయితే అందుకు నిరాకరించిన ప్రభుత్వం.. రైతులు పట్టువిడుపులు ప్రదర్శించాలని కోరింది. చట్టాల్లో సవరణలకు సిద్ధమని తెలిపింది. ఈ నేపథ్యంలో మరోసారి జనవరి 19న సమావేశం కావాలని ఇరు పక్షాలు నిర్ణయం తీసుకున్నాయి.
ఐదు గంటలపాటు చర్చ..
కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్, పంజాబ్‌కు చెందిన మరో కేంద్ర మంత్రి సోమ్ ప్రకాశ్ దిల్లీ విజ్ఞాన్ భవన్లో రైతులతో చర్చలు జరిపారు. 40 రైతు సంఘాల ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. భోజన విరామంతో కలిపి ఐదు గంటలపాటు చర్చ కొనసాగింది. తమ సమస్యలను చర్చల ద్వారానే పరిష్కారం కావాలని ఇరు పక్షాలు భావిస్తున్నట్లు రైతు సంఘాలు చెప్పాయి.
ఈ సందర్భంగా ఒకే అంశానికి కట్టుబడి ఉండకుండా పట్టువిడుపులతో ఉండాలని రైతు సంఘాలకు వ్యవసాయ మంత్రి తోమర్ విజ్ఞప్తి చేశారు. పలు డిమాండ్లకు అంగీకరించినా ప్రభుత్వం మొండిగా ఉందని, అహం ప్రదర్శిస్తోందని అనడం సరికాదని అన్నారు. భేటీ ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
"ఈ రోజు రైతు చర్చలు అసంతృప్తిగా ముగిశాయి. జనవరి 19 న మళ్లీ భేటీ అవుతాం. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవడానికి మేము సానుకూలంగా ఉన్నాము. తీవ్రమైన చలిలో ఆందోళన సాగిస్తున్న రైతుల పట్ల ప్రభుత్వం ఆందోళన చెందుతోంది."
--కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్
అయితే ఈ చర్చలు సానకూల ధోరణిలోనే జరిగాయని రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కమిటీ ముందుకు వెళ్లేది లేదని కిసాన్ సంఘర్షణ సమన్వయ సమితి అధ్యక్షురాలు కురుగంటి కవిత పేర్కొన్నారు. ముందుగా ఖరారైన విధంగానే కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో పోలీసులు పెడుతున్న ఇబ్బందులను ప్రస్తావించినట్లు తెలిపారు.
రైతు సంఘాల మధ్య ఇప్పటి వరకు జరిగిన చర్చల్లో విద్యుత్ బిల్లు, పంట వ్యర్థాలను కాల్చితే శిక్షల తగ్గింపు అంశంపై మాత్రమే ఏకాభిప్రాయం కుదిరింది. అయితే వ్యవసాయ చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కూడా రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంపైనే రెండు వర్గాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది.