పెట్రోల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు నిరసనలు చేపట్టనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) పిలుపునిచ్చింది. ఈ మేరకు రైతులు పెద్ద ఎత్తున తరలిరానున్నట్లు ఎస్కేఎం తెలిపింది.
"సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు గురువారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు దేశవ్యాప్తంగా రైతులు నిరసన చేపట్టనున్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధర పెంపునకు వ్యతిరేకంగా దాదాపు 2 గంటల పాటు ఈ నిరసనకు దిగనున్నారు."
--సంయుక్త కిసాన్ మోర్చా.
రైతులు.. నిరసన కేంద్రాలకు మోటార్ వాహనాల్లో, ట్రాక్టర్లలో, కార్లలో, ట్రక్కుల్లో వస్తారని, వీలైతే ఖాళీ గ్యాస్ సిలిండర్లు తీసుకురానున్నారని సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది. బుధవారం దిల్లీ, కోల్కతా ప్రాంతాల్లో పెట్రోల్ ధర లీటర్కు రూ. 100 దాటిన నేపథ్యంలో ఈ నిరసనకు పిలుపునిచ్చినట్లు తెలిపింది. ధరల పెంపు ప్రభావం సమాజంలోని అన్ని వర్గాల వారిపై ఉంటుందని ఎస్కేఎమ్ వెల్లడించింది. తమ నిరసనతోనైనా ప్రభుత్వం ధరలను తగ్గించాలని డిమాండ్ చేసింది.
ఇదీ చదవండి:రాజ్భవన్ల ఎదుట నిరసనలకు సన్నద్ధం