మహారాష్ట్ర అసెంబ్లీ ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని సుభాష్ భానుదాస్ దేశ్‌ముఖ్(55)గా గుర్తించారు. అతడిది ఒస్మానాబాద్లోని తాండల్వాడి గ్రామం. సోదరుడితో భూతగాదాల నేపథ్యంలోనే అతడు ఆత్మహత్యకు ప్రయత్నించాడని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ వెల్లడించారు.
ఇదీ జరిగింది..
రైతు అయిన దేశ్‌ముఖ్‌కు తన సోదరుడితో భూతగాదాలు తలెత్తాయి. ఇరువురూ ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలోనే మంగళవారం మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా.. మధ్యాహ్నం 12.30 గంటలకు ముంబయిలోని విధానసభ గేటు ముందుకు వచ్చిన సుభాష్ ఆత్మహత్యకు యత్నించాడు. వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. అయితే, అక్కడే ఉన్న కొంతమంది పోలీసులు అతడిని గమనించారు. వెంటనే దేశ్‌ముఖ్ వద్దకు వెళ్లి మంటలు ఆర్పేశారు. పెట్రోలింగ్ కారులో బాధితుడిని జీటీ ఆస్పత్రికి తరలించారు.
'బాధితుడు స్పృహలోనే ఉన్నాడు'..
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడణవీస్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. దీనిపై శాసనమండలిలో విపక్షాలు వివరణ కోరిన నేపథ్యంలో స్పందించారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 'అతడికి 15-20 శాతం కాలిన గాయాలయ్యాయి. ప్రభుత్వం దీన్ని పర్యవేక్షిస్తోంది. పోలీసులు మంటను ఆర్పేసి బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అతడు స్పృహలోనే ఉన్నాడు. మెరైన్ డ్రైవ్ పోలీసులు ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేపట్టారు' అని ఫడణవీస్ వివరించారు.