కుమారుడి ప్రవర్తన నచ్చక ఓ తండ్రి తన ఆస్తిలో సగం వాటాను పెంపుడు శునకం పేరున రాశాడు . ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఛింద్వాడా జిల్లాలో జరిగింది.
బరిబాడ గ్రామానికి చెందిన ఓం నారాయన అనే వ్యక్తికి తన పెంపుడు శునకం (జాకీ) అంటే చాలా ఇష్టం. కుమారుడి ప్రవర్తనతో కోపగించుకున్న నారాయణ ..పెంపుడు శునకం(జాకీ) పేరున తన ఆస్తిలో సగాన్ని రాసిచ్చాడు. మిగతా సగాన్ని తన రెండో భార్య చంపావర్మకు ఇస్తున్నట్లు వీలునామాలో పేర్కొన్నాడు.
"నా భార్య, జాకీ(శునకం) నన్ను బాగా చూసుకుంటున్నారు. అందుకే నా ఆస్తి మొత్తాన్ని వీరిద్దరి పేరున రాస్తున్నాను. నేను చనిపోయిన తరువాత నా ఆస్తి అంతా వీరికే చెందుతుంది. అంతేకాదు జాకీని ఎవరైతే చూసుకుంటారో దానిపేరున ఉన్న ఆస్తికి వారే వారసులు అవుతారు."
-ఓం నారాయణ
అయితే నారాయణకు ఇద్దరు భార్యలున్నారని గ్రామస్థులు తెలిపారు. మొదటి భార్య ధన్వంతి వర్మకు ముగ్గురు కూతుర్లు, ఒక కూమారుడు ఉన్నారని పేర్కొన్నారు. రెండో భార్య చంపావర్మకు ఇద్దరు కూతుర్లు ఉన్నారని చెప్పారు.
ఓం నారాయణ పేరున కోట్లరూపాయలు విలువ చేసే ఆస్తి , 18 ఎకరాల భూమి ఉన్నట్లు తెలిపారు. ఇంకా కొన్ని ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఈటీవీ భారత్ ఎఫెక్ట్: మూగజీవాలపై కర్కషం.. 12 మంది బైండోవర్