Couple Commits Suicide with Daughter in Khammam : అనారోగ్య సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ భార్యాభర్తలు.. తమ కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెంలో చోటుచేసుకుంది. భార్యకు క్యాన్సర్ నిర్ధారణ కావడంతో మానసికంగా తీవ్ర ఆవేదనకు గురైన ఆ దంపతులు.. కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెం ప్రాంతానికి చెందిన పోట్రు వెంకట కృష్ణారావు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య సుహాసిని(35), కుమార్తె అమృత(17), మరో కుమారుడు ఉన్నారు.
ఈ క్రమంలో నెలన్నర క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో సుహాసిని గర్భ సంచిలో సమస్య ఉంటే శస్త్ర చికిత్స చేసి కణతి తొలగించారు. ఆ తర్వాత డాక్టర్లు ఆమె రక్తాన్ని క్యాన్సర్ నిర్ధారణ కోసమని టెస్ట్‌లకు పంపించారు. ఈ క్రమంలో ఈ నెల 20న మరోసారి భార్యభర్తలు ఇద్దరు ఆసుపత్రికి వెళ్లి వాటి వివరాలు అడగగా.. సుహాసినికి క్యాన్సర్ వచ్చిందని వైద్యులు చెప్పారు. హైదరాబాద్ వెళ్లి మెరుగైన వైద్యం అందిస్తే వేగంగా నయమవుతుందని సూచించారు. దీంతో భార్యభర్తలు ఇద్దరు ఇంటికి వచ్చేశారు.
- Suicides in Telangana Today : క్షణికావేశం.. తీరని విషాదం.. కుటుంబం సహా ఆరుగురి ఆత్మహత్య
- భర్తతో గొడవ.. నలుగురు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్య
బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న తన కుమారుడిని ఇంటికి రమ్మని చెప్పారు. ఈ క్రమంలో ఇరుగుపొరుగు వారికి ఈ నెల 21న తమ కుమారుడు వచ్చిన తరువాత హైదరాబాద్ వెళ్తామని చెప్పారు. ముందుగా తిరువూరు ఆసుపత్రికి వెళ్తామని దగ్గరి వారికి చెప్పారు. వారితో పాటు కుమార్తెను సైతం వెంట తీసుకొని వెళ్లారు. కానీ వారు ముందుగానే అనుకున్నట్లు ఆసుపత్రికి వెళ్లకుండా ఆత్మహత్యకు సిద్ధమై మూడు తాళ్లు, స్టూల్స్ కొనుగోలు చేసుకొని కొత్తకారాయిగూడెంలోని తమ సొంత మామిడి తోటలోకి వెళ్లారు. అక్కడ కుమారుడికి ఫోన్ చేసి తాము ఆసుపత్రిలో ఉన్నామని నమ్మించారు.
Khammam latest news : డాక్టర్లు ఈరాత్రి ఇక్కడే ఉండమన్నారని ఫోన్లో వివరించారు. ఆ తరువాత వారు ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత వారి ఫోన్ ఎంతకూ స్పందించకపోవడంతో కుమారుడు ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ లేకపోవడంతో తెలిసిన వారిని ఆరా తీశాడు. దీంతో బంధువులకు సమాచారం ఇవ్వగా వారు కూడా వెతికారు. ఈ క్రమంలోనే వారి మామిడి తోటలో వెంకట కృష్ణారావు ద్విచక్ర వాహనం కొందరు గమనించారు.
దీంతో వారు తోటలోకి వెళ్లి చూడగా ముగ్గురు విగత జీవులుగా చెట్లకు వేలాడుతున్నారు. వారు గ్రామస్థులకు సమాచారం ఇవ్వగా పెద్ద ఎత్తున జనం మామిడి తోటకు చేరుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయాలు అలుముకున్నాయి. తల్లిదండ్రులతో పాటు సోదరి మృతి చెందడంతో కుమారుడిని ఓదార్చడం అక్కడున్న వారి ఎవరి వశం కాలేకపోయింది.
ఇవీ చదవండి: