Family Keeps Dead Body At Home : సాంకేతికత పుంతలు తొక్కుతున్న నేటి కాలంలో కూడా దేశంలో మూఢనమ్మకాలు తగ్గట్లేదు. మరణించిన మనిషి బతికివస్తాడనే ఆశతో మృతదేహాన్ని 20గంటలకు పైగా ఇంట్లోనే ఉంచారు అతడి కుటుంబ సభ్యులు. వైద్యులు మరణించినట్లు ప్రకటించినా వారు నమ్మలేదు. ఒడిశాలోని సంబల్పుర్ జిల్లాలో జరిగిందీ ఘటన.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని రైరాఖోల్ ప్రాంతానికి చెందిన బీరెన్ కనరా.. గత కొద్దిరోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యం విషమించడం వల్ల అతడు మృతి చెందినట్లు వైద్యులు గురువారం ప్రకటించారు. కానీ బీరెన్ కుటుంబసభ్యులు అతడి మరణ ధ్రువీకరణను అంగీకరించలేదు. ఆ తర్వాత తమ ఇంటికి బీరెన్ మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించకుండా అలానే 20 గంటలపాటు ఉంచారు.
"కొన్ని రోజుల క్రితం బీరెన్ కుటుంబసభ్యులు.. తమ పొరిగింటి వారితో గొడవపడ్డారు. ఆ సమయంలో వారు బీరెన్ను చేతబడి చేసి చంపేస్తామని బెదిరించారు. అదే సమయంలో అతడు అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే రైరాఖోల్ ఆస్పత్రిలో చేర్చాం. వైద్యులు అనేక రకాల పరీక్షలు చేశారు. కానీ ఎటువంటి నివేదిక రాలేదు. చివరికి అతడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. బీరెన్ మళ్లీ బతికొస్తాడనే ఆశతో మృతదేహాన్ని అతడి కుటుంబసభ్యులు ఇంట్లోనే ఉంచారు" అని మృతుడి బంధువు రఘుత్ కునారా తెలిపారు.
"బీరెన్ శరీరం ఇంకా చల్లగా అవ్వలేదట. అతడిలో ప్రాణం ఇంకా ఉందని కుటుంబసభ్యులు చెబుతున్నారు. నరాల్లో రక్తప్రసరణ కూడా జరుగుతోందని అంటున్నారు. అందుకు అతడు మళ్లీ బతికి వస్తాడని కుటుంబసభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు" అని మృతడి మరో బంధువు బైద్యనాథ్ బెహరా తెలిపారు.
చనిపోయిన బీరెన్ను మళ్లీ బతికించాలనే తపనతో కుటుంబసభ్యులు, బంధువులు పూజలు కూడా చేస్తున్నారు. మరోవైపు, 20 గంటలకు పైగా మృతదేహాన్ని దహనం చేయకుండా ఇంటి వద్దే ఉంచినందుకు కొందరు గ్రామస్థులు రైరాఖోల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహం స్వాధీనం చేసుకుని శవపరీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. అందుకు బీరెన్ కుటుంబసభ్యులు అంగీకరించలేదట. కొన్ని గంటల తర్వాత శవపరీక్షల చేపట్టేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం.