ఐపీఎస్ అధికారినంటూ మహిళలను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన దిల్లీలో జరిగింది. నిందితుడిని వికాస్ యాదవ్‌గా పోలీసులు గుర్తించారు. మహిళలే లక్ష్యంగా నిందితుడు సోషల్ మీడియాలో ఫేక్ ప్రోఫైల్ పెట్టి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. నిందితుడు స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ అని వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
వికాస్ యాదవ్.. 8వ తరగతి వరకు చదివాడు. అనంతరం వెల్డర్‌గా పనిచేశాడు. గ్వాలియర్ నుంచి దిల్లీకి మకాం మార్చిన తర్వాత ఓ రెస్టారెంట్లో పనిచేసేవాడు. అతడు పనిచేస్తున్న రెస్టారెంట్‌కు సివిల్స్‌కు సన్నద్ధమవుతున్న యువతులు, మహిళలు ఎక్కువగా వచ్చేవారు. ఈ క్రమంలోనే నిందితుడి మనసులో మహిళల్ని మోసం చేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే సోషల్ మీడియాలో తన ఫ్రొపైల్లో.. ఐఐటీ కాన్పుర్ పూర్వ విద్యార్థి అని.. 2021 యూపీ ఐపీఎస్ క్యాడర్ అధికారినని పెట్టాడు. అతడి ప్రొఫైల్‌ను చూసిన వివాహితలు, అమ్మాయిలు అతడి మాయలో పడిపోయేవారు. ఈ క్రమంలో నిందితుడిపై డిసెంబరు 17న పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ బాధితురాలు. కేసు నమోదు చేసుకున్న దిల్లీ పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.