Faction politics in Andhra Pradesh: అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ (MLA Gottipati Ravikumar) ఒకప్పుడు వైఎస్ కుటుంబానికి దగ్గరి వాడు. జగన్ (YS Jagan) పిలుపు మేరకు 2013 సంవత్సరంలో వైసీపీలో చేరారు. 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. తర్వాత తెలుగుదేశంలో చేరారు. 2019 ఎన్నికల్లో అద్దంకి నుంచి ఆ పార్టీ తరపున గెలుపొందారు. తర్వాత వైసీపీలో చేరాలని ఆహ్వానాలు వచ్చినా.. ఆయన అంగీకరించ లేదు. ఫలితంగా ఆయనపై కక్ష సాధింపు మొదలైంది.
వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి మొత్తం గ్రానైట్ వ్యాపారాన్నే వదిలేయాల్సి వచ్చింది. అంతేకాదు ఆయన వ్యాపార సహచరులు, అనుయాయులు కూడా పెద్దఎత్తున నష్టపోయారు. వందలమంది కార్మికులు, సిబ్బంది ఉపాధి కోల్పోయారు. ప్రతిపక్ష సభ్యుడనే ఒకే ఒక్క కారణంతో ఆయనకు చెందిన క్వారీలను మూయించేసి మిల్లులకు తాళాలేసి వందల కోట్ల జరిమానాలు వేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేధింపులకు గురి చేశారు.
ఒకే ఒక్క కారణంతో: వైసీపీలోకి రావాలన్న మాట కాదన్నాడనే ఒకే ఒక్క కారణంతో.. ఆయనతో పూర్వ పరిచయాలు, కుటుంబంతో సన్నిహిత సంబంధాల్ని కూడా మరచిపోయి.. ప్రభుత్వ పెద్దలు పగబట్టారు. పదే పదే పెత్తందార్లు, పేదలకు మధ్య పోటీ అని చెప్పుకునే జగన్.. కేవలం తమ పార్టీలోకి రాలేదనే ఒకే ఒక్క కారణంతో గొట్టిపాటి రవిని.. పెత్తందారీ పోకడలతో వేధిస్తున్నారు. వరస దాడులతో అష్టదిగ్బంధనం చేసి ఆర్థిక మూలాల్ని దెబ్బతీస్తున్నారు. రాష్ట్రంలో రాజ్యహింస అంటే ఎలా ఉంటుందో గొట్టిపాటి లక్ష్యంగా సాగిన రాక్షస క్రీడే ప్రత్యక్ష నిదర్శనం.
ఫ్యాక్షన్ మార్క్: ప్రత్యర్థుల ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడమే ఫ్యాక్షన్ రాజకీయంలో మొట్టమొదటి పాఠం. అందుకే అధికారం దక్కిందే తడవుగా.. ప్రత్యర్ధుల ఆర్థిక మూలాలపై కన్నేశారు.. ప్రభుత్వ పెద్ద. ప్రకాశం జిల్లాలోని గ్రానైట్ సామ్రాజ్యాన్ని గుప్పిట పట్టేందుకు వ్యూహాలు రచించి.. మొత్తం మైనింగ్ కార్యకలాపాలే ఆగిపోయేలా చేశారు. అందులో భాగంగానే కొందరు తెలుగుదేశం నేతలను లక్ష్యంగా చేసుకున్నారు. వారిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌తో వికృత రాజకీయ క్రీడ ప్రారంభించారు.
అధికారులతో దండయాత్ర: రాజ్యం తలచుకుంటే దెబ్బలకు కొదవేముంటుంది అన్నట్లుగా వివిధ శాఖల అధికారులతో రవికుమార్‌పై దండయాత్ర చేశారు. అక్రమ మైనింగ్ అంటూ దాడులు చేయించారు. రవికుమార్‌కు చెందిన 11 సంస్థల కార్యకలాపాల్ని నిలిపేయించారు. ఏకంగా 280 కోట్లకు పైగా జరిమానాలు చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. అంటే ప్రకాశం జిల్లాలో సుమారుగా ఒక సంవత్సరం మైనింగ్ రాబడికి ఇది సమానం. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా.. వెంటాడి వేధించారు. ఎగుమతులు నిలిపేయించారు. క్వారీలు మూసేయించారు. మిల్లులకు తాళాలేశారు. మొత్తంగా ఆయన మైనింగ్ వ్యాపారాన్ని దెబ్బతీశారు.
ఇంకా కసి తీరకపోవడంతో: క్వారీలు మూయించినా.. మిల్లులకు తాళాలేసినా కసి తీరకపోవడంతో.. కేసులకూ తెగబడ్డారు. ఇందులో క్రిమినల్ కేసులూ ఉన్నాయి. ఒక్కో సంస్థపై సుమారు అయిదు నుంచి ఆరు కేసులు నమోదు చేశారు. మొత్తంగా రవికుమార్‌కు సంబంధించిన సంస్థలపై 60 పైగా కేసులు పెట్టారు. అన్నివైపుల నుంచి ఉచ్చు బిగించారు. ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడంతోపాటు అడుగు వేయలేని పరిస్థితి కల్పించారు. దీంతో రవికుమార్‌తో పాటు ఆయన సహచరులు కూడా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు. ప్రభుత్వ దాడి నుంచి రక్షించుకునేందుకు ఆయన హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్లి జరిమానాల నుంచి ఉపశమనం పొందారు.
యంత్రాలను అమ్ముకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చి: క్వారీలు, మిల్లులు మూత పడటంతో వాటిలోని సుమారు 100 కోట్లకు పైగా విలువైన యంత్ర పరికరాలు తుప్పు పట్టాయి. నిరుపయోగంగా తయారయ్యాయి. వాటికి నెలవారీ కిస్తీలు కూడా చెల్లించలేని పరిస్థితి ఎదురైంది. చివరకు తుప్పు పడుతున్న యంత్ర పరికరాలను 15 కోట్లకు అమ్ముకోవాల్సి వచ్చింది. మైనింగ్ కార్యకలాపాల కోసం చేసిన బకాయిలను చెల్లించేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
అన్నింటినీ తట్టుకుని మరీ: ఆయన క్వారీలు, మిల్లుల్లో పనిచేసే వందలాది మంది కార్మికులతోపాటు.. గుమస్తాలు, ఇతర సిబ్బందికి ఉపాధి దూరమైంది. మైనింగ్ ఆదాయం రూపంలోనూ ఏడాదికి 100 కోట్ల చొప్పున చూసినా నాలుగేళ్లలో సుమారు 400 కోట్లకు పైగా నష్టపోయారు. అంటే అధికారం అండగా.. ఆయన ఆర్థిక మూలాలపై మొత్తంగా 500 కోట్లకు పైగా దెబ్బ కొట్టారు. అన్నింటినీ తట్టుకుని మరీ రవి.. తెలుగుదేశంలోనే కొనసాగుతున్నారు.