కృత్రిమ మేధ(ఐఏ), డేటా అనలిటిక్స్, మెషీన్ లెర్నింగ్ వంటి విధ్వంసక సాంకేతికతలు సహా స్వయం ప్రతిపత్తి, మానవరహిత వ్యవస్థ వంటి విషయాలపై ప్రస్తుతం సైనిక ప్రపంచంలో జోరుగా చర్చ సాగుతోంది. ఇటీవల జమ్ములోని వాయిసేన స్థావరంపై జరిగిన డ్రోన్ల దాడి ఘటనతో భారత సైన్యం మరింత అప్రమత్తమై.. అధునాతన సాంకేతికతలను సైన్యంలో క్రోడీకరించేందుకు సన్నద్ధమవుతోంది.
గురువారం ఓ కార్యక్రమానికి హాజరైన భారత సైన్యాధిపతి ఎంఎం నరవణె ఈ విషయాన్నే ప్రస్తావించారు. తక్కువ ధరకే డ్రోన్లు దొరుకుతుండటం, వాడటం కూడా సులభతరం కావడం వల్ల భద్రతా దళాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ఇవి మరింత క్లిష్టతరం చేశాయని ఆయన అన్నారు. సొంత ప్రాజెక్టులాగా డ్రోన్లను ఇంట్లోనే తయారు చేసుకునే వీలుంటుందన్నారు.
జమ్ము వాయుసేన స్థావరంపై దాడి ఘటనలో రెండు డ్రోన్లు పేలుడు పదార్థాలను జాడ విరిచిన నేపథ్యంలో.. ఈ తరహా దాడులు ఎంత ప్రమాదకరమో నరవాణె వివరించారు. ఇటీవల జరిగిన అంతార్జాతీయ ఘటనలను ఉదాహరించారు.
" కృత్రిమ మేధ అల్గారిథంలను ఉపయోగించిన డ్రోన్లను మొదట ఇద్లిబ్, ఆ తర్వాత అర్మేనియా-అజర్బైజాన్లో విధ్వంసక కార్యకలాపాలకు వాడారు. ట్యాంకులు, ఫిరంగులను ఉపయోగించే సంప్రదాయ సైనిక యుద్ధాలకు ఇవి సవాల్ విసురుతున్నాయి. కృత్రిమ మేధ.. ఓ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం. భౌగోళిక రాజకీయాలు, భౌగోళిక వ్యూహాలను తీవ్రంగా ప్రభావితం చేయగలదు. పారిశ్రామిక విప్లవాన్ని మించిపోగలదు. కృత్రిమ మేధ అపార శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని భారత సైన్యం ఇప్పటికే గుర్తించింది. 2018లో కృత్రిమ మేధపై ఏర్పాటైన జాతీయ టాస్క్ఫోర్స్ సిఫార్సుల మేరకు ఏఐ ఆధారిత ప్రణాళికలు, పథకాల విస్తరణ అమలును సైన్యం క్రమబద్ధీకరించింది. కొన్ని ఎంపిక చేసుకున్న ఏఐ సాంకేతికతలను.. సంస్థలోని డొమైన్ స్పెషలైజేషన్ల ఆధారంగా అభివృద్ధి చేస్తున్నాము."
- సైన్యాధిపతి ఎంఎం నరవణె.
ఊహించని పరిణామాలు..
అయితే అధునాతన సైనిక సాంకేతికతలు అనుకున్న విధంగా పనిచేయలేక విఫలమైతే.. తదనంతర పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నరవణె హెచ్చరించారు. ఈ పరిణామాలు వ్యవస్థాపరమైన వైఫల్యాల నుంచి సాయుధ సంఘర్షణ చట్టం ఉల్లంఘనల వరకు దారితీస్తాయని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ చట్టంతో సంబంధం లేకుండా రోబోటిక్ ఆయుధ పోటీ గురించి మానవ హక్కుల సంఘాలు హెచ్చరిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
మానవులు సృష్టించిన రోబోలు అనుకున్న విధంగా పనిచేయకపోతే పరిస్థితులు ఎంత భయానకంగా ఉంటాయో ఇప్పటికే పలు సైన్స్ ఫిక్షన్ సినిమాలు కళ్లకు గట్టాయి. ఈ నేపథ్యంలోనే నరవణె.. వ్యవస్థాపరమైన లోపాలు ఎంతటి ప్రమాదాలకు దారితీస్తాయో హెచ్చరించారు.
గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం కౌన్సిల్(GCTC) గురువారం ఏర్పాటు చేసిన 'అప్లికేషన్ల్ ఆప్ బిగ్ ఎనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్' సెమినార్లో నరవణె ఈ మేరకు మాట్లాడారు.