దేశంలో సాధ్యమైనంత ఎక్కువమందికి కరోనా టీకా అందిన తర్వాత పరిస్థితి ఏంటి? మాస్కులు పక్కనపెట్టొచ్చా? ఏ మేరకు నిబంధనలు పాటించాలి? ఇలా పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు.. పూర్తిగా టీకాలు పొందిన వ్యక్తులు మాస్కులు ధరించాల్సిన పనిలేదంటూ అమెరికాకు చెందిన డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) ప్రకటన ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చింది. అయితే సీడీసీ ప్రకటనతో కొందరు నిపుణులు విభేదిస్తున్నారు. అంతేకాకుండా అమెరికా, భారత్ పరిస్థితులను పోల్చలేమని చెప్తున్నారు.
'సమారు 70 శాతం ప్రజల్లో యాంటీబాడీలు ఉత్పత్తి అయితే హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమవుతోంది. అమెరికాకు హెర్డ్ ఇమ్యూనిటీ లభించిందనడానికి ఇప్పటివరకు శాస్త్రీయ ఆధారాలు లేవు' అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ జయాలాల్ అన్నారు. 'అలాగే ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన టీకాలు 70-80 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. రెండో దశలో భారత్‌లో కరోనా కొత్త రకం విస్తృతి అధికంగా ఉంది. ఈ కొత్తరకంపై టీకాల ప్రభావం 40-50 శాతంగా ఉంది. అందుకే కొత్త రకాలకు టీకా రెండు డోసులు మాత్రమే సరిపోకపోవచ్చు. రెండు డోసులు పొందిన వారు కూడా వైరస్ వాహకులు కావొచ్చు. అందుకే భారత దేశంలో నిబంధనలను సడలించడం సాధ్యం కాకపోవచ్చు' అని ఆయన అభిప్రాయపడ్డారు. సీడీసీ గణాంకాల ప్రకారం మే 17 నాటికి అమెరికాలో 47.4 శాతం మంది రెండు డోసుల టీకాలను పొందారు.
'భారత్, అమెరికాలో నెలకొన్న కొవిడ్ పరిస్థితులను మనం పోల్చలేం. జనాభా, టీకా కార్యక్రమ విస్తరణ ఇరు దేశాల్లో వేరుగా ఉంది. మన దేశంలో ఇంకా భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడు నిబంధనలను సడలించడం కుదరదు. ఇక్కడి ప్రజలు రెండు మాస్కులు ధరించాల్సిందే. సామాజిక దూరం పాటించాల్సిందే' అని గంగారామ్ ఆసుపత్రికి చెందిన నిపుణుడు ఒకరు అన్నారు. 'వైరస్ ప్రభావం ముగిసిందని జనవరిలో నిబంధనలు సడిలిస్తే.. ఏం జరిగిందో చూస్తున్నాం కదా' అని అంటూ వాస్తవ పరిస్థితులను కళ్లకుగట్టారు.
ఇటీవల ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా కూడా ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. కరోనా వైరస్ అనేక ఉత్పవరివర్తనలకు లోనవుతోందని, వాటిపై టీకాల సమర్థతపై తగిన సమాచారం లేదన్నారు. టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ..మాస్కులు ధరించాల్సిందేనని, భౌతిక దూరం పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : ముంచుకొస్తున్న మరో తుపాను- బంగాల్పై తీవ్ర ప్రభావం!