'వ్యాక్సినేషన్‌పై కేంద్రం ప్రకటన ఓ శుభపరిణామం' - కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ జనవరి 16 నుంచి
దేశంలో వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభానికి కేంద్రం తీసుకున్న నిర్ణయంపై అరోగ్య రంగ నిపుణులు స్పందించారు. పండుగల సమయంలో టీకా ప్రక్రియ ప్రారంభం శుభపరిణామమని వారంటున్నారు. టీకా వినియోగానికి అనుమతులు లభించిన తర్వాత రెండు వారాల సమయం దొరకడం ఎంతో ఉపయోగకరమని వివరిస్తున్నారు.
ఈ నెల 16 నుంచి దేశంలో కరోనా టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభంకానుందని కేంద్రం చేసిన ప్రకటనపై ఆరోగ్య నిపుణులు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం ఓ శుభపరిణామని పేర్కొన్నారు.
'పండుగల సమయంలో భారీ ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించడం మంచి పరిణామం' అని అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ ఇండియా డైరెక్టర్ జనరల్ డాక్టర్ గిరిధర్ జ్ఞాని 'ఈటీవీ భారత్'తో అన్నారు.
'టీకా అత్యవసర వినియోగానికి ఆమోదం లభించిన తర్వాత.. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యేందుకు కనీసం రెండు వారాల సమయం కావాలి. లాజిస్టిక్స్ సమస్యతో మొదలై.. వ్యాక్సినేషన్ కేంద్రాల గుర్తింపు, వ్యాక్సిన్ సరఫరా కోసం ప్రభుత్వ, ప్రైవేటు విమానయాన సంస్థలతో తుది ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటివి వాటికి ఇది అవసరమవుతుంది,' అని గిరిధర్ పేర్కొన్నారు.
ఈ రెండు వారాలు టీకా తయారు చేసే కంపెనీలకు ఎక్కువ డోసులు ఉత్పత్తి చేసేందుకూ ఉపయోగపడుతుందని తెలిపారు. ఒకసారి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభిస్తే.. టీకా తయారీదారులు ఎక్కువ డోసులు ఉత్పత్తి చేసేందుకు వీలుంటుందని వివరించారు.
ప్రభుత్వ వర్గాల ప్రకారం దేశంలోని ప్రతి రాష్ట్రంలో 600-700 వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దిల్లీలో ఇప్పటికే 621 కేంద్రాలు సిద్ధమయ్యాయి.
వ్యాక్సినేషన్ ప్రక్రియకు ముందు.. పూర్తి స్థాయిలో సిద్ధమయ్యేందుకు తమకు సరైన సమయం దొరికిందని ఏషియా సొసైటీ ఫర్ ఎమర్జెన్సీ మెడిసిన్ అధ్యక్షుడు డాక్టర్ టామొరిశ్ కోలే అన్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన టీకా డ్రై రన్లో తలెత్తిన సమస్యలన్నింటిని పరిష్కరించినట్లు వివరించిచారు.
దేశంలో అత్యవసర వినియోగానికి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్, ఆక్స్‌ఫర్ట్-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్ టీకాలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది.
ఇదీ చూడండి:ప్రజారోగ్యానికి సహకార వైద్యసేవల దన్ను