Delhi Excise Policy Case : దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా.. బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు సిసోదియా తరఫున సీనియర్ న్యాయవాది AM సింఘ్వీ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. సాయంత్రం 3 గంటల 50 నిమిషాలకు విచారణ చేపడతామని తెలిపింది. సిసోదియా.. దిల్లీ హైకోర్టును ఆశ్రయించి, తనపై దాఖలైన FIRను రద్దుచేయాలని కోరే అవకాశం ఉందని మొదట సుప్రీం ధర్మాసనం పిటిషనర్‌కు సూచించింది. తర్వాత ఆయన తరఫు న్యాయవాది వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. మధ్యాహ్నం విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. దిల్లీ మద్యం కేసులో సిసోదియాను అరెస్టు చేసిన సీబీఐ..ప్రత్యేక కోర్టు ఆదేశాలతో ఐదు రోజుల కస్టడీకి తీసుకుని ఆయన్ను విచారిస్తోంది.
అంతకుముందు ఈ కేసులో దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాను అరెస్ట్ చేసింది సీబీఐ. అరెస్టుకు ముందు ఆదివారం ఉదయం 11:12 నిమిషాలకు దిల్లీలోని సీబీఐ కార్యలయానికి హాజరైన మనీశ్‌ను అధికారులు దాదాపు 8 గంటలపాటు ప్రశ్నించారు. అనంతరం ఆయన్ను అరెస్టు చేసినట్లు సాయంత్రం ప్రకటించారు. ఈ వ్యవహారంలో కేరళకు చెందిన ఐఏఎస్ అధికారి దినేశ్ అరోరాతో సహా ఇతర నిందితులతో ఉన్న సంబంధాల పైనా సీబీఐ ఆరా తీసింది. వారితో జరిపిన సంభాషణల వివరాలనూ క్లుప్తంగా అడిగి తెలుసుకుంది. అయితే విచారణ సమయంలో మంత్రి సహకరించలేదంటూ సీబీఐ ఉన్నతాధికారులు వెల్లడించారు. చాలా ప్రశ్నలకు ఆయన స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదని.. అందుకే ఆయన్ను అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు. అరెస్టు నేపథ్యంలో సీబీఐ కేంద్ర కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. సీబీఐ ఆఫీసు పరిసరాలన్నీ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఆ తర్వాత కోర్టులో హాజరు పర్చగా 5 రోజుల సీబీఐ రిమాండ్‌ను విధించింది దిల్లీలోని రౌస్ అవెన్యూ జిల్లా న్యాయస్థానం. సానుకూలంగా స్పందించిన కోర్టు మార్చి 4 వరకు రిమాండ్‌కు అనుమతినిచ్చింది.
ఇదీ కేసు
కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధానంలో అనేక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. నిబంధనల ఉల్లంఘన సహా విధానపరమైన లోపాలతో ఈ ఎక్సైజ్ పాలసీని రూపొందించినట్లు దిల్లీ ప్రధాన కార్యదర్శి నివేదిక ఇచ్చారు. కొందరికి లబ్ధి చేకూర్చేలా టెండర్ల విధానంలో మార్పులు చేశారని తెలిపారు. అబ్కారీ శాఖ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న మనీశ్ సిసోదియా పేరును ప్రస్తావించారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కేంద్ర దర్యాప్తు సంస్థకు సిఫార్సు చేశారు. మొత్తానికి ఈ ఎక్సైజ్ నూతన పాలసీ విధానాన్ని రద్దు చేసింది ఆప్ సర్కార్.
ఇవీ చదవండి : మద్యం స్కామ్ కేసులో మనీశ్ సిసోదియాకు 5 రోజుల సీబీఐ కస్టడీ
మద్యం స్కామ్ కేసులో మనీశ్ సిసోదియా అరెస్ట్.. బీజేపీ, ఆప్ మాటల యుద్ధం