అర చేతిలో వార్తా ప్రపంచాన్ని కళ్ల ముందుంచే ఈటీవీ భారత్కు మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. అక్షరాస్యతా వార్తల విభాగంలో ఉత్తమ కథనాలను అందించినందుకు గానూ దక్షిణాసియా డిజిటల్ మీడియా అవార్డు లభించింది. డిజిటల్ విద్యలో పేదలు, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు, సంపన్న కుటుంబాల పిల్లలకు మధ్య వ్యత్యాసానికి సంబంధించిన కథనాలను ప్రచురించినందుకు గానూ ఈ గౌరవం దక్కింది.
కరోనా కాలంలో ఆన్లైన్ విద్యా బోధన కారణంగా పేద, గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు, అంతర్జాల సదుపాయాలు లేక ఆన్లైన్ తరగతులకు హాజరుకాలేకపోయిన పిల్లల గురించి ఈటీవీ భారత్ ప్రత్యేక కథనాలు ప్రచురించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వ, ప్రవేటు సంస్థలు చొరవ తీసుకోవాల్సిన అవసరముందని చాటిచెప్పింది. ఈ కథనాలకు గానూ వరల్డ్ అసోషియేషన్ ఆఫ్ న్యూస్‌పేపర్స్అండ్ న్యూస్ పబ్లిషర్స్-వాన్-ఇన్‌ఫ్రా.. దక్షిణాసియా డిజిటల్ మీడియా అవార్డు దక్కింది.