Equal Right for poor: అణగారిన వర్గాల ఇబ్బందులను అర్థం చేసుకొని వారికి చేయూతనిస్తేనే రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ హక్కుకు విలువ దక్కుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు పేర్కొన్నారు. కేరళలోని కొచ్చికి చెందిన శారదా కృష్ణ సత్గమయ ఫౌండేషన్ ఫర్ లా అండ్ జస్టిస్ సంస్థ నిర్వహించిన 7వ జస్టిస్ కృష్ణయ్యర్ స్మారక ఉపన్యాసాన్ని ఆయన ఆదివారం దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చారు. తన ప్రసంగంలో సమానత్వ హక్కును ప్రముఖంగా ప్రస్తావించారు.
"సామాన్యుల హక్కుల రక్షణ కోసం ఎంతో మంది ప్రజాప్రయోజన వ్యాజ్యాల ద్వారా రాజ్యాంగ కోర్టులను ఆశ్రయిస్తున్నారు. కోర్టులు కూడా తమ తీర్పుల ద్వారా ఎన్నో సార్లు వారికి అండగా నిలిచాయి. ఆహార హక్కు అన్నది అత్యంత ప్రాథమిక హక్కు. అందుకే సుప్రీంకోర్టు దాన్ని జీవించే హక్కులో అంతర్భాగమని చెప్పింది. ఆహారం అందించడానికి ప్రభుత్వాలు ఎన్నో పథకాలు రూపొందించాయి. ఆ తర్వాత ప్రధానమైంది జీవనోపాధి హక్కు. దీన్ని కూడా జీవించే హక్కులో అంతర్భాగంగా ప్రకటించడంతో అది ఉపాధి హామీ పథకం రూపకల్పనకు నాంది పలికింది. నివాస హక్కు, ఆరోగ్య హక్కు, విద్యా హక్కు కూడా జీవించే హక్కులో భాగమేనని వివిధ సందర్భాల్లో కోర్టు చెప్పింది. సమాజంలోని అట్టడుగువర్గాల హక్కులకు తన తీర్పుల ద్వారా న్యాయవ్యవస్థ గుర్తింపునిచ్చింది. బడుగులకు చేయూతనిచ్చి సమానావకాశాలు కల్పించకపోతే రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వం హక్కు ఎప్పటికీ అమల్లోకి రాదు. వారి ఇబ్బందులను అర్థం చేసుకుని వారు అందరితో సమాన స్థాయికి వచ్చేలా సాయం చేయాలి"
- జస్టిస్ నాగేశ్వరరావు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి
ఇవీ చదవండి: