జాబిల్లి ఉపరితలంపై చంద్రయాన్-2 ఆర్బిటర్ ఒక ఏడాది పాటు మాత్రమే పని చేస్తుందని తొలుత ఉహించినా.. ఏడేళ్ల పాటు అది సేవలు అందించగలదని భారత అంతరిక్ష పరిశోధన(ఇస్రో) విశ్వసిస్తోందని లోక్సభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. సాంకేతికపరంగా చంద్రయాన్-2 మిషన్ అత్యంత క్లిష్టమైన ప్రయోగం అని పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రయాన్-2 ప్రయోగానికి సంబంధించి లోక్సభలో అడిగిన ప్రశ్నకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
" నిర్దేశిత ప్రదేశంలో చంద్రయాన్-2 మృదువుగా ల్యాండింగ్ కాకపోయినప్పటికీ.. ఇతర లక్ష్యాలను ఈ ప్రయోగం గణనీయంగా సాధించింది. మొదట్లో చంద్రయాన్ ఆర్బిటర్ ఒక ఏడాది మాత్రమే పని చేస్తుందని ఊహించినా.. అది ఏడు సంవత్సరాలు సేవలు అందిస్తుందని ఆశిస్తున్నాము."
-జితేంద్ర సింగ్, కేంద్ర మంత్రి
2019 జులై 22న ఆంధ్రప్రదేశ్లోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-2ను ప్రయోగించింది ఇస్రో. చంద్రుడి దక్షిణ ధ్రువ విశేషాలను కనుగొడమే లక్ష్యంగా ఇస్రో చంద్రయాన్-2 మిషన్‌ను చేపట్టింది. ఇందులో భాగంగా ప్రయోగ చివరి నిమిషంలో సాంకేతిక కారణాలతో చంద్రుడి ఉపరితలాన్ని ల్యాండర్ గట్టిగా ఢీకొనగా సంబంధాలు తెగిపోయాయి. అయినప్పటికీ ఆర్బిటర్ సమాచారాన్ని పంపుతోంది.
ఇదీ చూడండి:చంద్రయాన్-3 ప్రయోగం 2022కు వాయిదా!