Covid duty of resident doctors: కరోనా బాధితులకు చికిత్స అందించే రెసిడెంట్ వైద్యుల డ్యూటీ సమయం 8గంటలకు మించకుండా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ). వారం రోజులు విధులు నిర్వర్తించిన తర్వాత 10-14 రోజుల పాటు క్వారంటైన్లో ఉంచాలని తెలిపింది. అందుకు వారు పని చేసే ఆసుపత్రులే వసతులు కల్పించాలని పేర్కొంది.
కొవిడ్ విధులు నిర్వర్తిస్తూ.. వైద్యులు అనారోగ్యానికి గురైతే వీలైనంత త్వరగా చికిత్స అందించాలని పేర్కొంది ఐఎంఏ. ఎవరైనా అనుకోకుండా మరణిస్తే.. వారి మరణ ధ్రువీకరణ, పరిహారం వంటివి త్వరగా అందించాలని తెలిపింది.
"కొవిడ్ రెండో దశలో సుమారు 2వేల మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. సాధారణ ప్రజల్లో మరణాల రేటు 1.5 శాతం ఉంటే.. ఆరోగ్య సిబ్బందిలో 2-3 శాతం మేర ఉంది. ఈ డేటా ప్రకారం ఇప్పటికే 1,00,000 మంది వైద్యులు కరోనా బారిన పడ్డారు. కరోనా మూడోవేవ్లో మరణాలు తక్కువగా ఉంటాయని భావిస్తున్నాం. కానీ, డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ 5.4 రెట్లు వేగంగా వ్యాపిస్తోంది. కొవిడ్ వార్డుల్లో పనిచేసే వైద్యులకే ముప్పు ఎక్కువ. సాధారణ ప్రజలతో పోలిస్తే.. 5-10 రెట్లు వైద్యులు కరోనా బారినపడే అవకాశం ఉంది. దేశంలోని అతిపెద్ద వైద్య కళాశాలలు, ఆసుపత్రులను తీసుకున్నా పెద్ద సంఖ్యలో వైద్య సిబ్బంది, ముఖ్యంగా డాక్టర్లు కరోనా బారినపడ్డారు. రెసిడెంట్ డాక్టర్ల కరోనా డ్యూటీ 8గంటలకు మించి ఉండకూడదు. ఏడు రోజులు విధులు నిర్వర్తించిన తర్వాత ఆసుపత్రి సూచించిన వసతిలో 10-14 రోజులు క్వారంటైన్లోకి పంపాలి. "
- ఇండియన్ మెడికల్ అసోసియేషన్
వైద్యుల కొరతతో ఆరోగ్య విభాగం ఇబ్బందులు ఎదుర్కొంటుందని, అలాంటి సమస్య తలెత్తకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది ఐఎంఏ. వైద్య కళాశాలల సమన్వయంతో కొవిడ్ కట్టడి చేపట్టాలని తెలిపింది.
ఇదీ చూడండి:వైద్యులపై కరోనా పంజా.. బిహార్లో మరో 59మందికి పాజిటివ్