Encounter In Kashmir: కశ్మీర్లో మరోసారి కాల్పులమోత మోగింది. కుల్గం జిల్లాలోని మిర్హామా ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ క్రమంలో ముగ్గురు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. వీరంతా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. ఇద్దరు స్థానికులు కాగా మరొకరు పాకిస్థాన్‌కు చెందిన తీవ్రవాదని పోలీసులు పేర్కొన్నారు. వీరి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
అనంతనాగ్‌లో కూడా..
అనంతనాగ్ జిల్లాలోని నౌగామ్ షాహ్‌బాద్ ప్రాంతంలో కూడా ఉగ్రవాదులు పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు హతమవగా.. ఓ అధికారి గాయపడ్డారు.
పోలీసు అధికారి వీరమరణం..
రెండు ఎన్కౌంటర్లలో మొత్తం ఆరుగురు ముష్కరులను మట్టుబెట్టాయి బలగాలు. అందులో నలుగురిని గుర్తించినట్లు చెప్పారు పోలీసులు. నలుగురిలో ఇద్దరు పాకిస్థానీలు, ఇద్దరు స్థానికులుగా తెలిపారు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతాల్లో మొత్తం నాలుగు ఏకే 47, రెండు ఎం4 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
రెండు ఘటనల్లో ముగ్గురు ఆర్మీ జవాన్లు, ఒక పోలీసు అధికారి గాయపడ్డారని తెలిపారు. అయితే, చికిత్స పొందుతూ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారని, జవాన్ల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి : భాజపా ఎమ్మెల్యేకు జెడ్ కేటగిరి భద్రత